Mlc Kavitha : దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) రెండోసారి సుదీర్ఘంగా విచారించింది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుమారు 10 గంటల పాటు విచారించారు. నిన్న (మార్చి 20) ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది.
ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్
దిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో రెండోసారి ఈడీ ఎదుట విచారణకు సోమవారం ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. సాయంత్రం 9 గంటలు దాటినా తర్వాత కవిత ఈడీ ఆఫీసు నుంచి బయట వచ్చారు. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు, సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమ భరత్ వెళ్లారు.
మళ్లీ నోటీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మంగళవారం (మార్చి 21) ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆమెను ఈడీ అధికారులుు పది గంటలకు పైగా విచారించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 20 ప్రశ్నలు ఈడీ అధికారులు కవితకు సంధించినట్లు తెలిస్తుంది. సోమవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత, అరుణ్ పిళ్లైను కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార లావాదేవీలు, లిక్కర్ స్కా్మ్ లో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. వైద్యులు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే ముందు కారు ఎక్కుతూ విక్టరీ సింబల్ చూపిస్తూ వెళ్లిపోయారు.
సుప్రీంలో కవిత పిటిషన్
దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ నెల 11న విచారించింది. అయితే ఈ నెల 16న మరోసారి విచారణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా 16న విచారణకు కవిత గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆమె తన లాయర్ తో ఈడీకి లేఖ పంపారు. అయితే దీనిపై స్పందించి ఈడీ ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. సుమారు పది గంటలకు పైగా ఈడీ ఆమెను విచారించింది. అయితే ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే కవిత పిటిషన్‌ను ముందుగా విచారణ చేయలేమని 24వ తేదీనే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ కవిత లేఖ రాశారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో ఎక్కడా పేర్కొనలేదన్నారు.
దర్యాప్తు చట్టప్రకారం జరగడంలేదనే అనుమానం కలుగుతుందని కవిత విమర్శించారు. సుప్రీంకోర్టులో ఈ నెల 24న తన పిటిషన్ విచారణ చేసే వరకూ ఆగాలని ఈడీని కోరారు. అయితే అందుకు ఈడీ ఒప్పుకోలేదు. ఈ నెల 20న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఈడీ నోటీసుల ప్రకారం ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ మరో ట్విస్ట్ ఇచ్చింది. రేపు కూడా విచారణకు హాజరవ్వాలని కవితకు నోటీసులు ఇచ్చింది. అలాగే సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ కూడా దాఖలుచేసింది. తమ వాదనలు వినేవరకూ కవిత పిటిషన్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరింది.