UPW-W vs GG-W, Match Highlights:
యూపీ వారియర్జ్ అభిమానులను మునికాళ్లపై నిలబెడుతోంది. ఆడిన ప్రతిసారీ థ్రిల్లింగ్ విక్టరీలు సాధిస్తోంది. ఆఖరి బంతికి విజయాలు అందుకుంటోంది. తాజాగా గుజరాత్ జెయింట్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. 179 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి మిగిలుండగా ఛేదించింది. గ్రేస్ హ్యారిస్ (72; 41 బంతుల్లో 7x4, 4x6) మరోసారి హరికేన్ ఇన్సింగ్స్ ఆడింది. తాహిలా మెక్‌గ్రాత్ (57; 38 బంతుల్లో 11x4) హాఫ్ సెంచరీతో చెలరేగింది. సోఫీ ఎకిల్‌స్టోన్ (19*; 13 బంతుల్లో 2x4) ఈసారీ మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. అంతకు ముందు గుజరాత్ జెయింట్స్ దయాలన్ హేమలత (57; 33 బంతుల్లో 6x4, 3x6), యాష్లే గార్డ్‌నర్ (60; 39 బంతుల్లో 6x4, 3x6) హాఫ్ సెంచరీలు బాదేశారు.
వాటే.. గ్రేస్!
ఛేదనలో ఎప్పట్లాగే యూపీ వారియర్జ్ విఫలమైంది! పవర్‌ప్లే ముగిసే సరికే 3 వికెట్లు నష్టపోయింది. రన్‌రేట్ మాత్రం తగ్గలేదు. 52 పరుగులు చేసింది. జట్టు స్కోరు 14 వద్ద అలిసా హీలీ (12)ని మోనికా పటేల్ ఔట్ చేసింది. 19 వద్ద కిరన్ నవగిరె (4)ను కిమ్‌గార్త్ పెవిలియన్ పంపించింది. 39 వద్ద దేవికా వైద్య (7)ను సుష్మావర్మా స్టంపౌట్ చేసింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో గ్రేస్ హ్యారిస్‌కు తాహిలా మెక్‌గ్రాత్ అండగా నిలిచింది. ఆమె సింగిల్స్ తీసి స్ట్రైక్ రొటేట్ చేయగా హ్యారిస్ మాత్రం బౌండరీలు, సిక్సర్లు బాదేసింది. దాంతో యూపీ 11.3 ఓవర్లకు 100కు చేరుకుంది.
ఆఖర్లో టెన్షన్
ఈ క్రమంలో మెక్‌గ్రాత్ 34 బంతుల్లో, హ్యారిస్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించి 17.1 ఓవర్లకు జట్టు స్కోరును 150కి చేర్చారు. నాలుగో వికెట్‌కు 78 (53 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని 117 వద్ద మెక్‌గ్రాత్‌ను ఔట్ చేయడం ద్వారా గార్డ్‌నర్ విడదీసింది. దీప్తి శర్మ (6) కాసేపే నిలిచింది. అయితే సోఫీ ఎకిల్ స్టోన్‌తో కలిసి హ్యారిస్ 23 బంతుల్లోనే 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 19వ ఓవర్ ఆఖరి బంతికి గ్రేస్‌ను కిమ్‌గార్త్ ఔట్ చేసి టెన్షన్ పెట్టింది. విజయానికి ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరం కాగా ఐదో బంతిని ఎకిల్‌స్టోన్ బౌండరీకి బాది విజయం అందించింది.
గుజరాత్ ఫర్లేదు!
ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌లు కావడంతో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్టుగానే భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు సోఫియా డాంక్లీ (23; 13 బంతుల్లో 3x4) , లారా వూల్‌వర్ట్ (17) మెరుపు ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 4.1వ బంతికి లారాను అంజలీ శర్వాణీ బౌల్డ్ చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే రాజేశ్వరీ గైక్వాడ్ అద్భుతం చేసింది. 5 పరుగుల వ్యవధిలో డాంక్లీ, హర్లీన్ డియోల్ (4) పెవిలియన్ పంపించింది. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి గుజరాత్ 50/3తో నిలిచింది.
హేమలత, గార్డ్‌నర్ హిట్టింగ్
ఈ సిచ్యువేషన్లో దయాలన్ హేమలత, యాష్ గార్డ్‌నర్ క్రీజులో నిలిచారు. మొదట ఆచితూచి ఆడారు. క్రమంగా జోరు పెంచారు. నాలుగో వికెట్‌కు 61 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యం అందించారు. హేమలత 33 బంతుల్లో హఫ్ సెంచరీ బాదేయడంతో 16 ఓవర్లకు గుజరాత్ 143తో స్ట్రాటజిక్ టైమ్‌ఔట్‌కు వెళ్లింది. అయితే వచ్చిన వెంటనే ఓ ఫ్లయిటెడ్ డెలివరీతో పర్శవీ చోప్రా ఆమెను ఔట్ చేసింది. 35 బంతుల్లోనే అర్ధశతకం కొట్టిన గార్డ్‌నర్ ఆమె బౌలింగ్లోనే స్టంపౌట్ అయింది. ఆఖర్లో సుష్మా వర్మ (5) అజేయంగా నిలవడంతో గుజరాత్ 178/6తో నిలిచింది.