GG vs UPW, WPL 2023: 


విమెన్‌ ప్రీమియర్‌ లీగు ఆఖరి మ్యాచులో గుజరాత్‌ జెయింట్స్‌ అదరగొట్టింది. యూపీ వారియర్జ్‌కు 179 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. నెమ్మదించిన పిచ్‌లపై ఈ స్కోరు తక్కువేమీ కాదు! యువ కెరటం దయాలన్ హేమలత (57; 33 బంతుల్లో 6x4, 3x6), యాష్లే గార్డ్‌నర్‌ (60; 39 బంతుల్లో 6x4, 3x6) హాఫ్ సెంచరీలు బాదేశారు. సోఫీ డాంక్లీ (23; 13 బంతుల్లో 3x4) మెరుపు ఓపెనింగ్‌ ఇచ్చింది. రాజేశ్వరీ గైక్వాడ్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.




మెరుపు ఓపెనింగ్‌


ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌లు కావడంతో టాస్ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనుకున్నట్టుగానే భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు సోఫియా డాంక్లీ (23), లారా వూల్‌వర్ట్‌ (17) మెరుపు ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 4.1వ బంతికి లారాను అంజలీ శర్వాణీ బౌల్డ్‌ చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే రాజేశ్వరీ గైక్వాడ్‌ అద్భుతం చేసింది. 5 పరుగుల వ్యవధిలో డాంక్లీ, హర్లీన్‌ డియోల్‌ (4) పెవిలియన్‌ పంపించింది. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి గుజరాత్‌ 50/3తో నిలిచింది.




చితక్కొట్టిన హేమ, గార్డ్‌నర్‌


ఈ సిచ్యువేషన్లో దయాలన్ హేమలత, యాష్‌ గార్డ్‌నర్‌ క్రీజులో నిలిచారు. మొదట ఆచితూచి ఆడారు. క్రమంగా జోరు పెంచారు. నాలుగో వికెట్‌కు 61 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యం అందించారు. హేమలత 33 బంతుల్లో హఫ్‌ సెంచరీ బాదేయడంతో 16 ఓవర్లకు గుజరాత్‌ 143తో స్ట్రాటజిక్‌ టైమ్‌ఔట్‌కు వెళ్లింది. అయితే వచ్చిన వెంటనే ఓ ఫ్లయిటెడ్ డెలివరీతో పర్శవీ చోప్రా ఆమెను ఔట్‌ చేసింది. 35 బంతుల్లోనే అర్ధశతకం కొట్టిన గార్డ్‌నర్‌ ఆమె బౌలింగ్లోనే స్టంపౌట్‌ అయింది. ఆఖర్లో సుష్మా వర్మ (5) అజేయంగా నిలవడంతో గుజరాత్‌ 178/6తో నిలిచింది.