Collectors Teleconference: ప్రజాపాలన ( Praja palana Applications) దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని తెలంగాణ (Telangana) సీఎస్ శాంతికుమారి (CS Shanthi Kumari ) కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజాపాలన సదస్సులు ముగిసిన వెంటనే దరఖాస్తుల్లోని డేటా ఎంట్రీ ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈనెల 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
డేటా ఎంట్రీపై రాష్ట్ర స్థాయి సిబ్బందికి గురువారం, జిల్లా స్థాయి సిబ్బందికి శుక్రవారం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆధార్, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా నమోదు చేయాలని, మండల కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ప్రజాపాలనను ప్రతి నాలుగు నెలలకోసారి నిర్వహిస్తున్నందున, ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారంతా మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి, అక్కడే సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రజాపాలన పేరుతో కార్యక్రమం చేపట్టింది. డిసెంబరు 28 నుంచి ఈనెల 6 వరకు...పది రోజులపాటు ప్రజాపాలన నిర్వహిస్తోంది. ఆయా జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం, గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకుంటోంది. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా నిర్ణయాలు తీసుకుంటోంది. జిల్లా అధికారులు గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు. తొలుత పది రోజుల పాటు గ్రామస్థాయిలో ప్రజాపాలన నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రజాపాలన సదస్సుల పొడిగింపు ఉండదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఆరు గ్యారెంటీల దరఖాస్తులు
ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు డిసెంబరు 28 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తోంది. 5వందల గ్యాస్ సిలిండర్, మహిళలకు 2వేల 500 నగదు బదిలీ, పెన్షన్ల పెంపు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల నగదుసాయం, కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమాను అమలు చేస్తోంది. హహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. చేయూత పథకం కింద దీన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది.