Dasoju In TRS : తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. మునుగోడు ఉపఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. కొంత మంది నేతలు టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరితే... ఆ పార్టీ నుంచి అంత కంటే ఎక్కువ మంది నేతల్ని టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ కు పార్టీ కండువా కప్పిన కే్టీఆర్... ఇవాళ సాయంత్రం మరో బీజేపీ కీలక నేత దాసోజు శ్రవణ్‌కు టీఆర్ఎస్ తీర్థం ఇవ్వనున్నారు. దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరి రెండు నెలలు కూడా కాలేదు. ఆగస్టు మొదటి వారంలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. అక్కడ సర్దుకోలేకపోయరో.. లేకపోతే.. టీఆర్ఎస్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందో కానీ రెండు నెలల్లోనే పార్టీ మారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖ పంపారు. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్నారు.
మునుగోడులో డబ్బులతో బీజేపీ గెలవాలనుకుంటోందన్న శ్రవణ్
రాజీనామా లేఖలో దాసోజు శ్రవణ్ బీజేపీ నాయకత్వపై విమర్శలు చేశారు. దశ దిశ లేని నాయకత్వంతో.. మునుగోడులో డబ్బుల సాయంతో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. నిర్మాణాత్మక రాజకీయాలు లేని బీజేపీ వల్ల తెలంగాణకు ఒరిగేదం లేదని నిరసనగా రాజీనామా చేస్తున్నానని బండి సంజయ్‌కు రాసిన లేఖలో దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
నేరుగా పార్టీలో చేరికల కోసం బీసీ నేతలుక ఫోన్లు చేస్తున్న కేసీఆర్
మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటం.. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. ఆయన బీజేపీలోని సీనియర్ బీసీ నేతలు ముఖ్యంగా ఉద్యమ నేపధ్యం ఉన్న వారికి ప్రత్యేకంగా ఫోన్లు చేసి టీఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. స్వామిగౌడ్, విఠల్ వంటి ఉద్యమకారులతోనూ కేసీఆర్ మాట్లాడారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాసోజు శ్రవణ్ .. వెంటనే టీఆర్ఎస్‌లో చేరేందుకు అంగీకరించారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్.. ఉద్యమ సమయంలో చిరంజీవి సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గతంలో టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదని రాజీనామా చేసి మళ్లీ అదే పార్టీలోకి శ్రవణ్
కాంగ్రెస్ పార్టీలో కొంత కాలం ఉన్న ఆయన.. ఖైరతాబాద్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ పరాజయం పాలయ్యారు. మంచి వాగ్దాటి ఉన్న ఆయనకు జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కానీ రెండు నెలలు గడిచినా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. మునుగోడులో బాధ్యతలు కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో ఆయనకు టీఆర్ఎస్ అధినేత నుంచి పిలుపు వచ్చింది. దీంతో టీఆర్ఎస్‌లో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరినప్పటికీ ప్రాధాన్యత లేని భావిస్తున్న స్వామిగౌడ్, విఠల్ వంటివారితోనూ నేరుగా కేసీఆర్ మాట్లాడటంతో వారు కూడా పార్టీలో మళ్లీ చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.