Dasara Holiday In Telangana: 
హైదరాబాద్‌: తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా సెలవు తేదీలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తొలుత ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం అక్టోబరు 24 దసరా సెలవు కాగా, తాజాగా దసరా సెలవును అక్టోబరు 23కి మార్పు చేసింది సర్కార్. దాంతో పాటు అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


స్కూల్ విద్యార్థుల సెలవులతో పాటు, మిగతా వారికి సైతం అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు వర్తిస్తాయి. ప్రభుత్వం తాజా ఉత్తర్వులలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర పండుగలలో ఒకటైన బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14వ తేదీని సాధారణ సెలవు ఇవ్వగా.. దుర్గాష్టమి అయిన అక్టోబర్ 22వ తేదీన ఐచ్ఛిక సెలవు (Optional Holiday) ఇచ్చింది.


రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకుప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి 25 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. తిరిగి అక్టోబరు 26న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని చెప్పింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని బోర్డు హెచ్చరించింది.


తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు, జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబరు 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. ఇక రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 7 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబరు 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని విద్యాశాఖ పేర్కొంది.


ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు 2022లో 14 రోజులు ఉండగా..2023లో మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తెరుచుకోనున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.