టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు రూ. 10 లక్షలు వస్తున్నాయి కదా.. నాకో రూ. 10 వేలు ఇవ్వండి నేను ఇప్పిస్తాననో, లేకపోతే ఇంకో రకంగా మీకు డబ్బులు వచ్చేలా చేస్తానంటూ దళారులు, బ్రోకర్లు చాలామంది తయారవుతారని, ఎవ్వరిమాట నమ్మవద్దని సూచించారు. మధిర నియోజకవర్గం బోనకల్, చింతకాని మండల కేంద్రం, సీతంపేట గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ నేత పర్యటించారు. దళిత బంధు పథకం 119 నియోజకవర్గాల్లో అమలయ్యేలా చూస్తామన్నారు.
తమ దగ్గర ప్రతి ఊరు లెక్క ఉందని.. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి.. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి.. కొత్తగా ఎంతమంది రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారన్న రికార్డులు సైతం ఉన్నాయని. రేషన్ కార్డు లేకపోయినా.. పెళ్లిళ్లు అయివుంటే వారికి సైతం ప్రత్యేకంగా దళిత బంధు వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరుగా మండలంలోని ప్రతి గ్రామానికి ఒక జిల్లా స్థాయి అధికారిని పంపిస్తారు. మీ ఇంటికే, మీ దగ్గరికే అధికారి వచ్చి.. లెక్కలు రాసుకుని, మీ పేరుమీదే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసేలా చేసే బాధ్యత కూడా తనదేనని భట్టి విక్రమార్క చెప్పారు. దళితబంధు పథకంపై అవగాహన లేని కొందరు నాయకులు చేసే ప్రకటనలతో దళితులు పార్టీ మారతారనే విషయం తనకు తెలిసిందన్నారు.
Also Read: కేటీఆర్‌కి అరుదైన ఆహ్వానం, ఈ ఛాన్స్ అందరికీ రాదట..! థ్యాంక్స్ చెప్పిన మంత్రి
తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, ఓట్ల కోసం, పార్టీ ప్రచారం కోసం అంతకన్నా రాలేదన్నారు. కేవలం దళిత ప్రజల శ్రేయస్సు కోసం రాజకీయాలకు అతీతంగా ఇక్కడకు వచ్చానన్నారు. బాగా బతకడం కోసం దళిత బంధు పథకాన్ని మీ అందరికీ వర్తించేలా, అందరికీ అందేలా చూస్తామన్నారు. ఈ దళితబంధు అమలుపై చాలా మందికి అపోహలు, అపనమ్మకాలు, రకరకాల సందేహాలు ఉన్నాయని.. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని స్పష్టం చేశారు. కేవలం టీఆర్ఎస్ పార్టీకో, కాంగ్రెస్, సీపీఎంలకు పరిమితం కాదని.. దళిత కుటుంబాలందిరికీ ఇచ్చే పథకం ఇది అన్నారు. దళిత కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.10 లక్షలు అందేలా చేయడం శాసనసభ్యుడిగా తనదే బాధ్యత అన్నారు.
బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేసిన తరువాత మీకు ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చునని సూచించారు. ఇందులో ఎవరి బలవంతం లేదని.. ఇతరులు చెప్పిన వ్యాపారాలు, పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. మీకు నచ్చిన వ్యాపారం, అది కూడా మీకు నచ్చిన చోట చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. దళిత బంధు పథకం అమలు చేసే వరకూ ఈ గ్రామాలన్ని తిరుగుతూనే ఉంటానని.. ఎవరికైనా పథకం రాకపోతే తన దృష్టికి తీసుకువస్తే.. వారికి కూడా పథకం కింద డబ్బులు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు.
తమ కుటుంబంలో ఇటీవల కుమారుడికి కొత్తగా పెళ్లయిందని, వారికి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే ఇప్పటికీ రాలేదనుకోండి. ఎలాగూ రేషన్ కార్డు లేదని ఒకే కుటుంబంగా చూస్తారని ఆందోళన అక్కర్లేదన్నారు. మీరు పెళ్లిచేసుకున్నా రేషన్ కార్డు రాకపోయినా, ప్రత్యేక కుటుంబంగానే చూసి రూ. 10 లక్షలు వచ్చేటట్లుగా చేస్తామని దళితులకు మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.