Cyberabad Police : తెలంగాణలో ఇవాళ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించి పొరపాటున వేరే పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చిన అభ్యర్థులను  గుర్తించి సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సకాలంలో వారిని పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. గ్రూప్-1 పరీక్షల కోసం వచ్చిన ఓ యువతి పొరపాటున కూకట్ పల్లి ప్రగతి డిగ్రీ కాలేజీ వద్దకు వెళ్లింది. ఉన్న కొద్ది సమయంలో తన సెంటర్ కి ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్న యువతిని సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్  పోలీస్ బైక్ రైడర్ పై  సరైన సమయానికి చైతన్య డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్ సెంటర్ కు చేర్చారు. దీంతో తనను పరీక్ష కేంద్రానికి సరైన సమయానికి తీసుకువచ్చిన సైబరాబాద్ పోలీసులకు ఆ యువతి కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే కుకట్ పల్లి ట్రాఫిక్ సీఐ నగేష్ వేరే పరీక్ష కేంద్రానికి పొరపాటున వచ్చిన ఇద్దరు విద్యార్థులను సరైన సమయానికి తమ పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు మొబైల్ వాహనంలో ఇద్దరు విద్యార్థులను పరీక్ష కేంద్రాల వద్దకు సరైన టైంకు చేర్చారు.


ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ 


తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తం 75శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 


బయో మెట్రిక్ సమస్యలు  


ఉదయం పదిన్నర గంటలకు మొదలైన గ్రూప్-1 ఎగ్జామ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింది. సెంటర్ల దగ్గర చివరి నిమిషంలో అభ్యర్థులు హడావుడి పడ్డారు. కొన్ని సెంటర్ల దగ్గర బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడంలో ఆలస్యమైంది. ట్యాబ్ లలో ఛార్జింగ్ లేకపోవడం, మరికొన్ని స్లోగా ఉండడంతో ఈ ప్రాసెస్ లేట్ అయింది. చెప్పిన టైంలోపల ఎగ్జామ్ సెంటర్ గేట్ లోనికి వెళ్లిన వారిని అనుమతించారు. 10.15 నిమిషాలకు సెంటర్ లోపలికి వెళ్లాలన్న నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడ్డారు. 


15 నిమిషాల లేట్ రూల్ 


లోపల తల్లులు ఎగ్జామ్ రాస్తుంటే... బయట వారి పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ ఆడిస్తూ కనిపించారు. మరోవైపు వర్షం కారణంగా కొందరు అభ్యర్థులు లేట్ అయ్యారు. మరికొందరికి సెంటర్ అడ్రస్ లు సరిగా దొరకకపోవడంతో ఆలస్యమయ్యారు. దీంతో వారందరినీ తిప్పి పంపారు. కొందరు అభ్యర్థులైతే కొన్ని సెకన్ల గ్యాప్ తో ఎగ్జామ్ మిస్ అయ్యారు.  గతంలో 1 నిమిషం నిబంధన ఉండేదని, ఇప్పుడు 15 నిమిషాల లేట్ రూల్ తీసుకొచ్చారని ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు అంటున్నారు. తాము టైంకే వచ్చినా లోపలికి అనుమతించలేదని ఆబిడ్స్ స్టాన్లీ కాలేజ్ దగ్గర అభ్యర్థులు వాపోయారు.