సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. బదిలీ చేసి ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. సజ్జనార్‌ స్థానంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో కొనసాగుతున్నారు. తెలంగాణలో జనగామ జిల్లాకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా తొలిసారి నియమితులయ్యారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఇన్స్‌పెక్టర్ జనరల్‌గానూ సేవలందించారు.


Also Read: Vijayashanthi: కేసీఆర్ మైండ్ బ్లాంక్ అవుతుంది.. ఇక అవేం పని చేయవు, బండి సంజయ్‌పై విజయశాంతి పాటలు విడుదల


2008లో వరంగల్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ యువతులపై యాసిడ్ దాడి జరిగింది. అప్పుడు వరంగల్ జిల్లాకు ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు.  ఆ టైమ్ లోనే.. యాసిడ్ దాడి చేసిన యువకుల ఎన్ కౌంటర్ జరిగింది.  ఈ ఘటనతో ఆయన ప్రధానంగా తెరపైకి వచ్చారు.  


2019లో హైదరాబాద్‌లో సంచలనం రేపిన పశువైద్యురాలు దిశపై అత్యాచారం, హత్య కేసు విషయంలోనూ నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. ఆ సమయంలోనూ.. వీసీ సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్నారు. దీంతో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.  మల్టీ లెవెల్ స్కాములను ఛేదించడంలో సజ్జనార్‌కు మంచి పేరుంది. కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు. ఈ ఏడాది మార్చిలో తెలంగాణ ప్రభుత్వం వీసీ సజ్జనార్‌కు అడిషనల్ డీజీపీ హోదా ఇచ్చి పదోన్నతి కల్పించింది.


సమర్థమైన అధికారిగా స్టీఫెన్ రవీంద్ర
సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తగా నియమితులైన స్టీఫెన్ రవీంద్ర విషయానికి వస్తే.. ఈయన 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. పోలీస్ శాఖలో సమర్థుడైన అధికారిగా ఆయనకు పేరు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్‌ కార్యకలాపాలను ఆటకట్టించడంతో పాటు సంఘ వ్యతిరేక శక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.


సోమవారమే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్‌ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం.. వెంటనే సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసింది. త్వరలో మరిన్ని బదిలీలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కూడా దాదాపు మూడేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.


Also Read: VC Sajjanar IPS: వీసీ సజ్జనార్ ఆకస్మిక బదిలీ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం, కొత్త అపాయింట్‌మెంట్ ఎక్కడంటే..


Also Read: Huzurabad News: ఆ డబ్బులు తీసుకొని నాకే ఓటేస్తా అంటున్నారు.. ఈటల కీలక వ్యాఖ్యలు