మన దేశంలో కరోనా వైరస్ విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళన పడుతున్న వేళ అందుకు మరింత బలం చేకూర్చే వార్తను ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ప్రకటించారు. ప్రస్తుతం అందరూ కరోనా మూడో వేవ్ వస్తుందేమోనన్న భయంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు కీలక ప్రకటన చేశారు. భారత్‌లో ఈ ఆగస్టు నెలలోనే మరోసారి కరోనా విశ్వరూపం చూపడం మొదలుపెడుతుందని వివరించారు. ఇలా కేసులు క్రమంగా పెరుగుతూ అక్టోబరు నాటికి కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేశారు. అయితే, రెండో వేవ్ మిగిల్చిన తీవ్రమైన ప్రాణ నష్టాలతో పోల్చితే.. మూడో వేవ్ విజృంభణ కాస్త తక్కువగానే ఉంటుందని తెలిపారు.


ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన విద్యాసాగర్‌, కాన్పూర్ ఐఐటీకి చెందిన మణీంద్ర అగర్వాల్‌ నాయకత్వంలో పరిశోధకులు కరోనా మూడో వేవ్ తీవ్రతను అంచనా వేశారు. మూడో వేవ్ అత్యధిక స్థాయిలో ఉన్న దశలో రోజువారీ కేసుల సంఖ్య దేశంలో లక్ష లోపు ఉంటుందని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉంటే అది 1.5 లక్షలకూ చేరొచ్చని అంచనా వేశారు.


రెండో వేవ్‌‌లో ఈ ఏడాది మేలో కరోనా తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. అత్యధికంగా రోజుకు 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల గ్రాఫ్ అమాంతం ఊహించని స్థాయికి పెరిగిపోయింది. ఆ తర్వాత అదే తరహాలో వేగంగా తగ్గుముఖం పట్టింది. అయితే, మూడో వేవ్ మరీ దారుణం కాకుండా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని వేగం చేయాలని సూచించారు. వైరస్‌కు హాట్‌స్పాట్‌లుగా మారుతున్న ప్రాంతాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు పరిశీలన అవసరం ఉంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ తాజా విజృంభణకు కారణమైన డెల్టా రకం కరోనా వైరస్‌ మన దేశంలోనే తొలిసారి వెలుగు చూసిన అంశాన్ని ఐఐటీ హైదరాబాద్ నిపుణులు గుర్తు చేశారు.


ప్రజల్లోనూ అలసత్వం..
ప్రస్తుతం కరోనా కేసులు కొత్తవి తక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు చురుగ్గా బయట తిరుగుతున్నారు. గత ఏడాది కరోనా మొదటి వేవ్ ముగిశాక.. జనం పెళ్లిళ్లు, వేడుకల్లో బాగా పాల్గొన్నారు. ఫలితంగా ఈ ఏడాది మార్చిలో రెండో వేవ్ మొదలైంది. ఇది రేపిన విలయతాండవం అందరికీ తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ మార్చిలో మొదలై ఇప్పటికి 5 నెలలు గడించింది. ఇప్పుడు దేశంలో రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 40 వేల వరకూ నమోదవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకూ కూడా 26 వేల వరకూ ఉంటున్న కేసులు ఇప్పుడు మళ్లీ 40 వేలకు పెరిగాయి.