Sharmila : కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై ఎటూ తేలడం లేదు.  సెప్టెంబర్ 30 కల్లా క్లారిటీ వస్తుందని షర్మిల ఆశాభావంతో ున్నారు. కానీ  కాంగ్రెస్ నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు.  దీంతో  ఒంటరి పోరుకు సిద్దమయ్యే అవకాశాలు ఉన్నాయి.     తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌టీపీని ఏర్పాటు చేసిన షర్మిల.. పార్టీని బలోపేతం చేయాలని పాదయాత్ర కూడా నిర్వహించి గట్టిగానే ప్రయత్నించారు. కానీ పెద్దగా బజ్ రాకపోడంతో  తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమైపోయారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ కు ప్రతిపాదనపెట్టారు. 


షర్మిల పార్టీ విలీనంపై ఎటూ చెప్పని కాంగ్రెస్ 


రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. కానీ విలీనం దిశగా ఇప్పటివరకు ఎలాంటి అడుగూ పడలేదు. షర్మిల వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఆమె చేరిక వల్ల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రెచ్చగొట్టే అవకాశం ఉందని అందుకే చేర్చుకోవద్దని హైకమాండ్‌కు తేల్చిచెప్పేశారు. చివరికి కాంగ్రెస్ హైకమాండ్..  షర్మిలకు అటు ఓకే కానీ.. ఇటు నో అని కానీ చెప్పలేదు. అలా నాన్చడంతో   షర్మిల తదుపరి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేకపోయారు. కాంగ్రెస్‌కు సెప్టెంబర్  30 వరకూ గడువిచ్చినా స్పష్టత లేదు. 


ఒంటరి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్న షర్మిల


కాంగ్రెస్ పార్టీతో విలీనం లేదని తేలిపోవడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు పార్టీని సన్నద్దం చేయాలని భావిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్టీపీలో పని చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పని చేసిన నాయకులను ఏకం చేసే పనిలో పడ్డారు.   రాబోయే తెలంగాణ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారు.  కొన్ని నెలలుగా పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో చాలా మంది నాయకులు సైలెంట్‌గా ఉన్నారు. ఏపూరి సోమన్న లాంటి వాళ్లు బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు మరో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని.. తానే స్వయంగా ఒకటి రెండు చోట్ల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. పాలేరు, ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు.  


మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి


పార్టీ స్థాపించిన తర్వాత చేసిన సుదీర్ఘ పాదయాత్ర క్రెడిట్ అంతా.. విలీనం పేరుతో చేసిన రాజకీయంతో తుడిచిపెట్టుకొని పోయిందని పార్టీలో చర్చ జరుగుతున్నది. పైగా కాస్తో కూస్తో జనాల్లో తెలిసిన నాయకులు పార్టీని వీడి తమ దారి తాము చూసుకున్నారు.  ఇప్పుడు షర్మిల పార్టీని మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం షర్మిలను సంప్రదిచిందని.. రెండు, మూడు రోజుల్లో షర్మిల ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని వైఎస్ఆర్‌టీపీకి చెందిన కొన్ని  వర్గాలు చెబుతున్నాయి.