న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను విడుదల చేసింది.  14 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి ప్రకటించింది.  తెలంగాణలోని నాలుగు స్థానాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భువనగిరి నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి నాలుగు స్థానాలు, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి చెరో 3 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను 8వ జాబితాలో ప్రకటించింది. తాజా జాబితా ఖరారుపై చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయి చర్చించారు. రాష్ట్రంలో మరికొన్ని స్థానాలను కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది. 




తెలంగాణ లోక్‌సభ నలుగురు అభ్యర్థులు.. 
- ఆదిలాబాద్‌ (ఎస్టీ) - సుగుణ కుమారి చెలిమల
- నిజామాబాద్‌ - తాటిపర్తి జీవన్‌ రెడ్డి
- మెదక్‌  - నీలం మధు
- భువనగిరి  - చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి


ఉత్తరప్రదేశ్‌ లో 4 ఎంపీ అభ్యర్థులు
- ఘజియాబాద్‌  - డాలీ శర్మ
- బులంద్‌షహర్‌ (ఎస్సీ)  - శివరాం వాల్మికి
- సీతాపూర్‌   - నకుల్‌ దూబే
- మహారాజ్‌గంజ్‌  - వీరేంద్ర చౌధరి


మధ్యప్రదేశ్‌ లో లోక్‌సభ అభ్యర్థులు
- గుణ - రావు యద్వేంద్ర సింగ్‌
- దామోహ్‌ - తావర్‌ సింగ్‌ లోధి
- విదిశ  - ప్రతాప్‌ భాను శర్మ


ఝార్ఖండ్‌ నుంచి లోక్‌సభ అభ్యర్థులు
- కుంటి (ఎస్టీ) - కాళీచరణ్‌ ముండా
- లోహర్దగ (ఎస్టీ) - సుఖ్ దేవ్‌ భగత్‌
- హజారి బాగ్‌  - జై ప్రకాశ్ భాయ్‌ పటేల్‌


ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా ఆత్రం సుగుణ 
కాంగ్రెస్ అధిష్టానం MP అభ్యర్థుల 8వ జాబితా, తెలంగాణ నుంచి మూడో జాబితా విడుదల చేసింది. ఆదిలాబాద్ ఎంపి అభ్యర్థిగా ఆత్రం సుగుణ పేరు ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఎంపి అభ్యర్థిగా ఆత్రం సుగుణ పేరు ఖరారు కావటం పై ఆదివాసి నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆత్రం సుగుణ గతంలో మావోయిస్టు నేతగా.. ఆపై కలమడుగు ఎంపిటిసిగా.. ఆపై ప్రభుత్వ ఉద్యోగి టిచర్ గా పనిచేశారు. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో సీఏం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేడు కాంగ్రెస్ అధిష్టానం అదిలాబాద్ ఎంపి అభ్యర్థిగా ఆమే పేరును ఖరారు చేసింది. దీంతో అధిష్ఠానం పిలుపు మేరకు హైదరాబాద్ కు హుటహుటీన బయలు దేరారు.