Abhishek Sharma hits fastest fifty by Sunrisers Hyderabad batter breaks Travis Head’s record in the same match: హైదరాబాద్(Hderabad) వేదికగా ముంబై(MI)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్(SRH) బ్యాటర్లు చెలరేగిపోయారు. ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. ట్రానిస్ హెడ్ 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేయగా.... అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. దొరికిన బంతిని దొరికినట్లు హైదరాబాద్ బ్యాటర్లు బాదేశారు. బంతిపై ఏదో కసి ఉన్నట్లు ఊగిపోయారు. బంతి వేయడానికే బౌలర్లు వణికిపోయేంత విధ్వంసం సృష్టించారు.
హైదరాబాద్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ
ఐపీఎల్ చరిత్రలోనే హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరపున అత్యంత వేగవంతమైన అర్ధ శతకం సాధించిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఉప్పల్ స్టేడియంలో బౌండరీల మోత మోగుతోంది. మఫాకా వేసిన 10 ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. 16 బంతుల్లోనే అభిషేక్ శర్మ (54*) హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్ స్కోర్ 148/2. 22 బంతుల్లోనే 63 పరుగులు చేసి అభిషేక్ అవుటయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అభిషేక్ అవుటయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు సిక్సులతో అభిషేక్ 63 పరుగులు చేశాడు. ట్రానిస్ హెడ్ 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు.
రోహిత్‌కు సచిన్ స్పెషల్ జెర్సీ
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్.. హిట్ మ్యాన్‌కు 200వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో రోహిత్ ముంబై తరఫున 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ముంబై స్టార్ ప్లేయర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు... క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక జెర్సీ అందించాడు. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. 239 మ్యాచ్‌లతో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో ఉండగా.... 221 మ్యాచ్‌లతో ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. 2011 నుంచి ముంబైకి ఆడుతున్న హిట్‌మ్యాన్.. 5084 పరుగులు చేశాడు. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా రోహితే. 2013 సీజన్ మధ్యలో ముంబయి పగ్గాలు అందుకున్న రోహిత్.. జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
రికార్డ్ స్థాయిలో తమ టీంకు 5 టైటిళ్లు అందించిన రోహిత్ ను కాదని హార్ధిక్‌పాండ్యా(Hardik Pandya )ని ఈ సారి కెప్టెన్ ని చేశారు ముంబై ఇండియన్స్ యాజమాన్యం. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడంతో నెట్టింట్లో మీమ్స్ బాగా వైరల్ అయ్యాయి. కానీ, ప్రాక్టీస్‌లో అందరితో కలిసి పాల్గొనడం, హార్ధిక్‌తో మామూలుగానే ఉండటం రోహిత్ మీద ఈ ఎఫెక్ట్ ఏమీలేదని నమ్ముతున్నారు అభిమానులు. కానీ మ్యాచ్ లు జరిగే కొద్దీ ఎలా ఉంటుందనేది కొంచెం ఆసక్తికర అంశంగా చెప్పొచ్చు.