Telangana News: తెలంగాణలో రాబోయే ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరగబోతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ వస్తే తనకు సంతోషంగా ఉంటుందని, రాష్ట్రంతో తనకున్న బంధం రాజకీయ సంబంధం కాదని చెప్పారు. మంథని బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా పార్టీకి నష్టమని తెలిసినా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. ఒక కుటుంబంతో ఉండే అనుబంధం తనకు తెలంగాణతో ఉందన్న రాహుల్, నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలకు తెలంగాణతో మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు.


కింగ్ 'కేసీఆర్'


తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని రాహుల్ విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్య శాఖలన్నీ తమ ఆధీనంలోనే ఉంచుకున్నారని మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని, రూ.లక్ష రుణ మాఫీ ఎంతమందికి చేశారో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. భూస్వాములు, ధనవంతులకు మేలు చేసేందుకే రైతు బంధు తెచ్చారని ధ్వజమెత్తారు. 'ధరణి' పేరుతో భూములు కంప్యూటరైజ్డ్ చేస్తున్నామని చెప్పి పేదల భూములను లాక్కున్నారని రాహుల్ ఆరోపించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్లు దోచుకున్నారని, ప్రాజెక్టులతో కేసీఆర్, గుత్తేదారులకే ప్రయోజనం కలిగిందని మండిపడ్డారు. 


కేసీఆర్ లానే మోదీ కూడా..


సీఎం కేసీఆర్ లానే ప్రధాని మోదీ కూడా అబద్ధాలు చెప్పి గెలిచారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, మరి అలా వేశారా.? అని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారని, మరి ఉద్యోగాలు వచ్చాయా.? అని నిలదీశారు. గ్యాస్ ధరలు పెంచి మోదీ ప్రభుత్వం పేదలపై భారం వేసిందని విమర్శించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని రాహుల్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోందన్నారు. 


'మాట నిలబెట్టుకుంటాం'


ఆరు గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సింగరేణి గనులను అదానీకి అమ్మే ప్రయత్నం జరిగితే అడ్డు పడతామని, సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా ఆపుతామని హామీ ఇచ్చారు. సభలో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఆర్మూర్ సభతో ముగింపు


మరోవైపు, శుక్రవారం నిర్వహించనున్న ఆర్మూర్ సభతో తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర ముగియనుంది. నిజామాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఆయన యాత్ర రద్దైంది. ఢిల్లీకి అత్యవసరంగా వెళ్లాల్సి ఉండడంతో నిజామాబాద్ సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆర్మూర్ సభ తర్వాత హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్, శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలు దేరనున్నారు.