తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల 2 జాబితాలను ఇప్పటికే అధిష్టానం విడుదల చేసింది. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులకు, రెండో జాబితాలో 45 మందికి అవకాశం కల్పించారు. అయితే, ఈ జాబితాలో చోటు దక్కని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వలేదని, నిన్న కాక మొన్న వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారుతున్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తనకు టికెట్ కేటాయించకపోవడంపై జంగా రాఘవరెడ్డి అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చిన రేవూరి, నాగరాజు, యశశ్వికి టికెట్లు ఇచ్చారని, తనకు మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు. కేయూ భూములు అమ్ముకున్న నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ఇది ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. నాయిని ఓ బ్రోకర్, అసమర్థుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని, ప్రజల్ని మోసం చేయలేదని భద్రకాళి అమ్మవారి మీద తాను ప్రమాణం చేస్తానని, ఇందుకు నాయిని సిద్ధమా.? అని రాఘవరెడ్డి సవాల్ విసిరారు. పార్టీ మీటింగ్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశానని అన్నారు.
నాయకులు సిద్ధంగా లేరు
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. అయితే, నాయకులే సిద్ధంగా లేరని రాఘవరెడ్డి ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని, స్వలాభం కోసం పార్టీని నాశనం చెయ్యొద్దని హితవు పలికారు. ఏ సర్వే ప్రకారం మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారని నిలదీశారు.
త్వరలో భవిష్యత్ కార్యాచరణ
వరంగల్ పశ్చిమలో వినయ్ భాస్కర్ కు, తనకు మధ్యే పోటీ అని రాఘవరెడ్డి అన్నారు. 6 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులు ఉంటారని, అవసరమైతే ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకుంటానని చెప్పారు. ఈ విషయంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, సోమవారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు పట్టణ మాజీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇతర మహీళా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కు గొట్టిముక్కల రాజీనామా
కూకట్ పల్లి టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా, ప్రతిసారి చివరి నిమిషంలో తనకు టికెట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో శుక్రవారం రెండో జాబితాను విడుదల చేయగా, కూకట్ పల్లి సీటును శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు పార్టీ కేటాయించింది. దీంతో మనస్తాపానికి గురైన గొట్టిముక్కల కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
'యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ విధానాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాను. దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి నాయకత్వంలో దశాబ్దాల పాటు పని చేశా. కార్యకర్తగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాను. కూకట్ పల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను. 1990లో కూకట్ పల్లి సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నికై ఆ తరువాత సింగిల్ విండో చైర్మన్ అయ్యాను. 1998లో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం. 2009లో కార్పొరేటర్ గా.. ఇలా పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నా.' అయినా నాకు పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు గొట్టిముక్కల లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపారు.
Also Read: టికెట్ దక్కలేదని కాంగ్రెస్‌కు గొట్టిముక్కల రాజీనామా, బాధతో కంటతడి