Singhvi And Vem Narender Reddy as Rajya Sabha candidates: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. హస్తం పార్టీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. దేశవ్యాప్త రాజకీయ సమీకరణలు, రాష్ట్ర రాజకీయ అవసరాల మధ్య సమతుల్యత పాటిస్తూ ఈ ఇద్దరినీ ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
సింఘ్వీకి మరో అవకాశం
గతంలో ఉప ఎన్నిక ద్వారా తెలంగాణ నుంచి పెద్దల సభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ పదవీ కాలం ముగియనుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కీలక న్యాయవాదిగా, ట్రబుల్ షూటర్‌గా ఉన్న ఆయన సేవలను దృష్టిలో ఉంచుకుని పార్టీ మళ్ళీ ఆయనకే మొగ్గు చూపింది. రాష్ట్ర నాయకత్వం కూడా సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్లమెంట్‌లో పార్టీ వాణిని బలంగా వినిపించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
రేవంత్ నమ్మకస్తుడు 'వేం'కు దక్కిన గుర్తింపు
ఇక రెండో అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రికి రాజకీయ సలహాదారుగా ఉన్న ఆయన, రేవంత్ రెడ్డి కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన వ్యక్తి. పార్టీ కోసం, ప్రభుత్వం కోసం తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్న నరేందర్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం రేవంత్ గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే రెడ్డి వర్గానికి పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి ఉందని.. ఇటీవల భర్తీ చేసిన పదవులన్నీ ఇతర వర్గాలకే ఇస్తున్నామని ఈ సారి.. రెడ్డి వర్గానికిచాన్స్ ఇవ్వాలన్న వాదన రేవంత్ గట్టిగా వినిపించారు. వేం నరేందర్ రెడ్డికి కాకపోతే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఆయన ఆసక్తి చూపించలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
విధేయతకు పట్టం
ఈ ఇద్దరి ఎంపిక ద్వారా కాంగ్రెస్ అటు జాతీయ అవసరాలను, ఇటు స్థానిక సమీకరణలను మేళవించింది. సింఘ్వీ ద్వారా ఢిల్లీ స్థాయిలో పార్టీకి బలం చేకూరుతుండగా, వేం నరేందర్ రెడ్డి ఎంపిక ద్వారా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లయింది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్పష్టమైన మెజారిటీ దృష్ట్యా, ఈ ఇద్దరు అభ్యర్థుల ఎన్నిక దాదాపు లాంఛనమే కానుంది. ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ తమ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం తక్కువగా ఉండటంతో, వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం మెండుగా ఉంది. దీంతో తెలంగాణ నుంచి పెద్దల సభకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం మరింత బలోపేతం కానుంది.
