Just In





Telangana CLP Meeting : సీఎల్పీ మీటింగ్‌కు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా! సమావేశంలో ఏం చర్చించారంటే!
Telangana News: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లడం, ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Telangana CLP Meeting In Hyderabad: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశమైంది. సీఎం, ఎమ్మెల్యేల ముఖాముఖిగా జరుగుతోన్న ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీప దాస్‌మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ భేటీలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాబోయే ఎన్నికల్లో కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అంతర్గత వ్యవహరాలతో పాటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపైనా చర్చిస్తున్నారు.
ఈ రెండు చరిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్ ప్రాధాన్యాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపైనా కూడా చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణ అమలు, స్థానిక సంస్థల్లో 42శాతం సీట్లు ఇస్తామనే హామీపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం సహా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సమావేశాలు పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సభలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్డున ఖర్గేతో పాటు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వీటిపై ఫిబ్రవరి 1న సీఎం, పలువురు మంత్రులతో సమావేశమై అనేక అంశాలపై చర్చించారు.
ఈ మధ్య కాలంలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల శైలి చర్చనీయాంశమవుతోంది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు బయటికి రావడం నష్టం చేకూరుస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పరిణామాలతో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా సమావేశం అయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి మంత్రులతో మాట్లాడి సమన్వయం పెరిగేలా సీఎం దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సీఎల్పీ సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలు
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు సైతం తాజా సీఎల్పీ సమావేశానికి హాజరు కావాలని అధికారులు ఆహ్వానం పంపారు. అయినప్పటికీ వారు చివరి నిమిషంలోనూ భేటీకి హాజరు కాలేదు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉండడంతోనే వారు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. ఇది అత్యంత కీలకమైన శాసనసభాపక్ష సమావేశమని చెప్పారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక సూచనలు చేస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకే బాధ్యతలు ఇచ్చారని చెప్పారు.
ఢిల్లీకి వెళ్లనున్న సీఎం
సీఎల్పీ మీటింగ్ అనంతరం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశంకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ, కులగణనపై అధిష్టానానికి వివరించనున్నారు. వీటితోపాటు కాంగ్రెస్ ప్లాన్ చేసిన రెండు భారీ సభలకు ఆయన్ని ఆహ్వానించనున్నట్టు సమాచారం. బీసీ జనసభ, ఎస్సీ జనసభ అనే పేర్లతో ఈ 2 భేటీలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే 2 రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం.. పలు కీలక అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read : TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత, పేపర్లవారీగా ఉత్తీర్ణత ఇలా