CM Revanth Reddy Serious On Corruption In The Name Of HYDRA: గత కొద్ది రోజులుగా తెలంగాణలో హైడ్రా (HYDRA) పేరు మార్మోగుతోంది. చెరువులు కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించిన వారికి నోటీసులు జారీ చేసి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చేస్తున్నారు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎవరినీ వదలకుండా 'హైడ్రా' అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా, సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి సైతం అధికారులు నోటీసులు అందించడం సంచలనం సృష్టించింది. నగరంలో అక్రమ కట్టడాలు కూల్చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా 'హైడ్రా' ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ (CM Revanth Reddy) తెలిపారు. అయితే, హైడ్రా చర్యలపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అక్రమ కట్టడాలే లక్ష్యంగా హైడ్రా తన పని తాను చేసుకుపోతోంది. కాగా, హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు అందాయి. కొందరు అధికారులు 'హైడ్రా' పేరు చెప్పి తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
సీఎం సీరియస్ వార్నింగ్
గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేళ్ల కిందట ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొందరు అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని.. కొన్నిచోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఫిర్యాదులు అందాయని చెప్పారు. అలా 'హైడ్రా' పేరు చెప్పి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా వసూళ్లకు పాల్పడే వారిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.
సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి ఇంటికి సైతం 'హైడ్రా' అధికారులు నోటీసులు అందించారు. మాధాపూర్‌లోని అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న తిరుపతి రెడ్డి నివాసం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందని గుర్తించిన అధికారులు నోటీసులు అంటించారు. అటు, దుర్గంచెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోపు అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
స్పందించిన సీఎం సోదరుడు
కాగా, ఈ నోటీసులపై సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 'అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశాను. నాకు ఇల్లు అమ్మిన యజమాని అన్ని అనుమతులతోనే ఆ ఇల్లు నిర్మించారు. అది కొనుగోలు చేసేటప్పుడు బఫర్ జోన్‌లో ఉందని నాకు చెప్పలేదు. కానీ ఇప్పుడు నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని నోటీసులు వచ్చాయి. ఆ ఇల్లు నిబంధనల ప్రకారం లేకుంటే కూల్చేయవచ్చు. సమయం ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాను. బీఆర్ఎస్ వాళ్లు నన్ను లక్ష్యంగా చేసుకుని అమర్ సొసైటీ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు.' అని తిరుపతిరెడ్డి పేర్కొన్నారు.
Also Read: Revanth Reddy: కోర్టు పట్ల కనీస గౌరవం లేదా? సీఎం రేవంత్‌పై సుప్రీంకోర్టు సీరియస్