CM Revanth Reddy Responds On Hyderabad Metro L&T Issue: హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలిగేందుకు ఎల్అండ్‌టీ సిద్ధమైనట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాజాగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉచిత బస్ పథకం (Free Bus Scheme) కారణంగా హైదరాబాద్ మెట్రో పథకం నుంచి ఎల్అండ్‌టీ వైదొలగాలని భావిస్తే అందుకు తాము స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఫ్రీ బస్ పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అని.. అది ఏ కారణంతోనూ ఆగదని చెప్పారు. 'మెట్రో రైల్ నిర్వహణ నుంచి ఎల్అండ్‌టీ వైదొలగితే దాన్ని ఆపరేట్ చేయడానికి ఆసక్తి ఉన్న వేరే వారిని అన్వేషిస్తాం. ఓ కాంట్రాక్టర్ పోతే మరో కాంట్రాక్టర్ వస్తారు. ఇందులో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఫ్రీ బస్ పథకం కొనసాగుతుంది.' అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయిందని.. ఎక్కువగా పురుషులే మెట్రోలో ప్రయాణిస్తున్నారని.. ప్రస్తుత రైడర్ షిప్ దృష్ట్యా నిర్వహణ భారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఎల్అండ్‌టీ ప్రెసిడెంట్, డైరెక్టర్, సీఎఫ్‌వో శంకర్ రామన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతల నుంచి 2026 తర్వాత తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ సహా ఊబర్, ఓలా, ర్యాపిడో తదితర సంస్థల వల్ల కూడా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందన్నారు. లోటును పూడ్చుకునేందుకు చర్యలు చేపట్టినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫ్రీ బస్ పథకంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో L&T వాటా 90 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 10 శాతం వాటా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎక్కువగా మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం లేదని.. దీంతో నిర్వహణ భారం పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్రీ బస్ సర్వీస్ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని.. ఎల్అండ్‌టీ నిర్ణయాన్ని స్వాగతిస్తామని.. ఒకవేళ మెట్రో రైల్ నిర్వహణ నుంచి ఎల్అండ్‌టీ వైదొలగితే వేరే వారిని అన్వేషిస్తామని అన్నారు.