CM Revanth Reddy Key Comments In Mock Assembly: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెరపైకి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితిని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్ - 18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొన్నారు. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్లు నిండాలనే నిబంధన ఉందని.. అది తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 'ఓటు హక్కు పొందేందుకు వయో పరిమితి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ, ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధన మాత్రం సవరించలేదు. ఈ నిబంధన కూడా సవరించుకుని 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. దీని ద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పని చేస్తున్నప్పుడు.. 21 ఏళ్లు నిండిన వారు ఎమ్మెల్యేలుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నా. మాక్ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రపతి, ప్రధానికి పంపించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా.' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కులగణన సర్వేపై..
బాలల దినోత్సవం సందర్భంగా అటు హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులగణనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే కోసం ఇంటింటికీ అధికారులు వస్తున్నారని.. ఈ విషయాన్ని విద్యార్థులంతా తల్లిదండ్రులకు చెప్పాలని అన్నారు. కులగణనకు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలంటే కులగణన సర్వే జరగాలని అన్నారు. 'కొంతమంది కుట్ర పూరితంగా కులగణన సర్వేపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పకొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంది. ఇది ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తొలగించడం కాదు. ఈ సర్వే మెగా హెల్త్ చెకప్ లాంటిది.' అని పేర్కొన్నారు.
'రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్'
'జవహర్ లాల్ నెహ్రూ భారత తొలి ప్రధానే కాదు. దేశాన్ని ప్రపంచం ముందు గొప్పగా చూపించిన నేత. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తాం. ఇటీవలే హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం. గత ఐదేళ్లలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయి. బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించాం. ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని పదోన్నతలు ఇచ్చాం. బదిలీలు చేశాం. స్కూళ్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ బడుల ప్రతిష్ట పెంచే బాధ్యత టీచర్లదే. ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకోవాలి. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 7 వరకూ విజయోత్సవాలు నిర్వహిస్తున్నాం. అనుకున్న విధంగా బాలల దినోత్సవం రోజున ఉత్సవాలు ప్రారంభించాం. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకు పంపుతాం.' అని రేవంత్ పేర్కొన్నారు.