CM Revanth Reddy Comments In Koluvula Festival: రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏళ్లపాటు సాగదీసిందని.. నోటిఫికేషన్ దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని విమర్శించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 'కొలువుల పండుగ' (Koluvula Festival) కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖలో ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 659 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 145 మంది వ్యవసాయ అధికారులు, 64 మంది లైబ్రేరియన్ల సహా 605 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు. తెలంగాణ పునఃనిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 'మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలన్న ఆలోచనతో ఆనాడు నేను చేపట్టిన 'విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్'కు మీరంతా మద్దతిచ్చారు. కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పాను. చెప్పినట్లే జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు లేక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువత నిరాశ చెందారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏళ్ల కొద్దీ వాయిదా పడుతోన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు పరిష్కారం చూపింది.' అని రేవంత్ పేర్కొన్నారు.


'90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు'


రాష్ట్రంలో 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చి యువత తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసే విధంగా చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో 11,063 మందికి టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. ఓ వైపు వందేళ్ల అనుభవం ఉంటే.. మరోవైపు పదేళ్ల దుర్మార్గం ఉందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం అనే ముసుగు వల్ల కేసీఆర్ ఎన్నో ఏళ్లు గౌరవం పొందారని.. అది ఉద్యమ ఘనతే తప్ప ఆయనది కాదని విమర్శించారు. నమ్మకంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుందామని అన్నారు.


'మూసీని ప్రక్షాళన చేస్తాం'


ఇంజినీర్ల కృషి, గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరమని.. 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్ నిర్మాణం కాబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. 55 కిలో మీటర్ల మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ నిర్మాణం కాబోతున్నట్లు పేర్కొన్నారు. 'మూసీ అంటేనే మురికి కూపమనే పేరు స్థిరపడింది. ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా.?. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్లు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఎవరి భూములు పోలేదా.?. మల్లన్న సాగర్ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారు. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తాం. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలి.' అని సీఎం పేర్కొన్నారు.


Also Read: Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు