CM Revanth Reddy Meets MM Keeravani And Ande Sri: హైదరాబాద్ రాయదుర్గంలోని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) స్టూడియోను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ గేయంపై కవి అందెశ్రీ (Ande Sri), సంగీత దర్శకులు కీరవాణితో రేవంత్ రెడ్డి చర్చించారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిందని తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గేయంలో మార్పులు చేర్పులపై మరోసారి సమాలోచనలు చేసిన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గేయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరిలో రాష్ట్ర గేయంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఈ గేయం ప్రజాదరణ పొందింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాది మంది ఉద్యమకారుల్లో ఈ గేయం స్ఫూర్తి నింపింది. తెలంగాణలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ గీతంగా, ప్రార్థనా గీతంగా ఈ గేయాన్ని ఇప్పటికే ఆలపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ గేయానికి రాష్ట్ర గేయంగా అధికారిక హోదా కల్పించారు.
ఈ నేపథ్యంలోనే ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డితో కీరవాణి భేటీ అయ్యారు. తెలంగాణ ఖ్యాతిని చాటిన ‘జయ జయహే తెలంగాణ’ పాటకు స్వరాలు చేకూర్చాలని కోరారు. అనంతరం కీరవాణి, అందెశ్రీలకు జ్ఞాపికలను అందించి సత్కరించారు. త్వరలో ‘జయ జయహే తెలంగాణ’ గేయం సరికొత్తగా రూపుదిద్దుకోనుందని తెలంగాణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కళాకారులను అవమానించడమే
‘జయ జయహే తెలంగాణ’ గేయానికి సంగీతాన్ని అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కీరవాణికి అప్పగించడంపై తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన్(టీసీఎంఏ) విమర్శించింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘జయ జయహే తెలంగాణ’ గేయానికి సంగీతం అందించే బాధ్యత పొరుగు రాష్ట్రానికి చెందిన కీరవాణికి ఇవ్వడం చారిత్రక తప్పిదం అవుతుందని టీసీఎంఏ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి విడుదల చేయడంపై తెలంగాణ ప్రజలు, కళాకారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని టీసీఎంఏ నాయకులు అన్నారు.
తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఇంతటి గొప్ప గేయాన్ని పాడించే అవకాశం, సంగీతాన్ని అందించే బాధ్యతను తెలంగాణ కళాకారులకు కాకుండా పొరుగు రాష్ట్రం వారికి అప్పగించడం సరైన నిర్ణయం కాదని లేఖలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారని, ఈ అవకాశాన్ని తెలంగాణ వాసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.