Ananthapur Political News: ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్ తాడిపత్రి. ఇక్కడ గొడవలు, కేసులు సర్వసాధారణం. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటారు. రాళ్లు విసురుకుంటారు. ఇక్కడ రాజకీయ పార్టీ వైరం మరింత దారుణంగా ఉంటుంది. వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy), జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) వర్గాల మధ్య వైరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి(SP Gowthami Sali)ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలవడం అనంతపురం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ధర్మవరం నియోజకవర్గ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన ఎస్పీకి విజ్ఞప్తి చేయడం విశేషంగా మారింది.


వారికి సంబంధం లేదు
తాడిపత్రి అల్లర్లతో ధర్మవరం నేతలకు సంబంధం లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ గౌతమి శాలికి వివరించారు. కేవలం తనను పరామర్శించేందుకు మాత్రమే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇతర నేతలు తాడిపత్రి వచ్చారని ఆయన వెల్లడించారు. ధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు బనాయించాలన్న ఆలోచన విరమించాలని కోరారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు చేస్తే ఫ్యాక్షన్ ప్రేరేపించినట్లు అవుతుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.


పోలింగ్ రోజు ప్రారంభమైన ఉద్రిక్తత
పోలింగ్‌ రోజు ప్రారంభమైన ఉద్రిక్తత తాడిపత్రిలో చల్లారలేదు. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలు రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఉద్రిక్తలను అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు. 


ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత
ఎన్నికల సందర్భంగా పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఘర్షణ జరిగింది. ఆ తర్వాత నుంచి పెద్దారెడ్డి కనిపించలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గర వైసీపీ నేతలు సైతం గొడవకు దిగారు. వారిని చెదరగొట్టే సమయంలో పోలీసులు విసిరిన టియర్‌ గ్యాస్‌తో జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. అయితే పెద్దారెడ్డి ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో ఆయన అభిమానుల్లో టెన్షన్ పడ్డారు. నియోజకవర్గంలో ఉద్రిక్తలు, ఆందోళనలను తగ్గించేందుకు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు తాడిపత్రి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పోలింగ్ తర్వాత అల్లర్ల నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు పవన్ రెడ్డిని తాడిపత్రి నుంచి పంపించారు.


ఈ నేపథ్యంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైసీపీ నాయకులు తాడిపత్రి వెళ్లి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీనిపై కేసు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ ఎస్పీ గౌతమి శాలిని కలిసి తనను పరామర్శించడానికి వచ్చిన వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టొద్దని కోరారు.