CM Revanth Reddy Key Decision On Yadagirigutta Temple Board: యాదాద్రి పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా (Yadagirigutta) మార్చారు. ఇకపై అన్ని రికార్డుల్లోనూ యాదాద్రి బదులుగా యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు (Yadagirigutta Temple Board) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. వేద పండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. టీటీడీ స్థాయిలో యాదగిరిగుట్ట బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా అధ్యయనం చేసి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.






సీఎం కీలక ఆదేశాలు


గో సంరక్షణకు గోశాలలో ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. 'భక్తులు కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తి చేయాలి. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు పూర్తి చేయాలి. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో రావాలి. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలి.' అని అధికారులకు నిర్దేశించారు.


Also Read: HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్