CM Revanth made key remarks: దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ, ఇందిరా, రాజీవ్ గాంధీలు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించారని, అటువంటి త్యాగధనుల కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్ గాంధీలను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు.  డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.  

Continues below advertisement

అందరినీ కలుపుకుపోవడమే విజయం 

కష్టం తెలియకుండా పదవులు పొందే అవకాశం ఉన్నా, ప్రజల కోసం రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని, అలాగే వైఎస్ షర్మిల కూడా వారసత్వ పదవులను ఆశించకుండా తెలంగాణలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇప్పుడు ఏపీలో పార్టీ కోసం శ్రమిస్తున్నారని వారి అంకితభావాన్ని ప్రశంసించారు.  డీసీసీ అధ్యక్షులు తమను తాము జిల్లాకు అధిపతులుగా భావించవద్దని, వ్యతిరేకించిన వారిని అణచివేసే ప్రయత్నం చేయవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి మద్దతు కోరానని, ఆ ఐక్యత వల్లే పార్టీ ఓటు బ్యాంకు 2 శాతం నుండి 40 శాతానికి పెరిగి అధికారం దక్కిందని గుర్తు చేశారు. 119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలను నమోదు చేయించడం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని, బాగా పనిచేసిన డీసీసీ అధ్యక్షులకు ఎమ్మెల్యేలుగా, అనుబంధ విభాగాల నేతలకు కార్పొరేషన్ పదవుల్లో అవకాశం కల్పించామని స్పష్టం చేశారు.

Continues below advertisement

కుట్రలను తిప్పికొట్టాలి.. మెరిట్ కోటాకే ప్రాధాన్యం 

రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ శిక్షణా తరగతులను అధ్యక్షులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ఏ కోటా ఉండదని, కేవలం  మెరిట్ కోటా  మాత్రమే ఉంటుందని, పైరవీలకు తావులేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణలో 100 ఏళ్ల తర్వాత కులగణన చేపట్టామని, ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని, సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీలు, మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం ఓబీసీలు ఎన్నికవ్వడం కాంగ్రెస్ సాధించిన సామాజిక విజయమని ఆయన వివరించారు.          

 రెండు రాష్ట్రాల అభివృద్ధి - కాంగ్రెస్ లక్ష్యం 

వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయకుండా బాధ్యతగా మెలగాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. తాను ఏనాడూ పైరవీలు చేయలేదని, 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ తనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా, రెండు చోట్లా కాంగ్రెస్ బలోపేతం కావాలని, రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్షని సీఎం రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు.