UGC declares 32 universities fake across India: దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ విశ్వవిద్యాలయాల విషయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి గుర్తింపు లేకుండా నడుస్తున్న 32 విశ్వవిద్యాలయాలను యూజీసీ నకిలీవిగా ప్రకటించింది. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ 12 సంస్థలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని, వీటిలో చదివి పొందే సర్టిఫికెట్లు ఉద్యోగాలకు గానీ, పైచదువులకు గానీ చెల్లుబాటు కావని యూజీసీ స్పష్టం చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ నకిలీ వర్సిటీల సంఖ్య పెరగడం విద్యా రంగంలో ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రెండు నకిలీ వర్సిటీలు
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో రెండు సంస్థలు నకిలీవని యూజీసీ తేల్చి చెప్పింది. గుంటూరులోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ , విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా లకు యూజీసీ గుర్తింపు లేదని వెల్లడించింది. ఈ సంస్థలు ఇచ్చే డిగ్రీలు చెల్లవని, విద్యార్థులు వీటిలో ప్రవేశాలు పొంది మోసపోవద్దని అధికారులు సూచించారు.
తెలంగాణలో క్లీన్ చిట్
మరోవైపు, నకిలీ విశ్వవిద్యాలయాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఊరట లభించింది. యూజీసీ విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం తెలంగాణలో ఒక్క నకిలీ యూనివర్సిటీ కూడా లేకపోవడం విశేషం. విద్యా ప్రమాణాల అమలులో మరియు అక్రమ సంస్థల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.
డిగ్రీలు చెల్లవు.. అప్రమత్తంగా ఉండండి
ఈ నకిలీ వర్సిటీల జాబితాను విడుదల చేయడమే కాకుండా, విద్యార్థులు ఏదైనా యూనివర్సిటీలో చేరే ముందు ఆ సంస్థకు యూజీసీ యాక్ట్ 1956 ప్రకారం గుర్తింపు ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలని సూచించింది. కేవలం ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోతే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించింది. ఢిల్లీ తర్వాత ఉత్తరప్రదేశ్ (4), పశ్చిమ బెంగాల్ (2) వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంస్థలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
