Telangana government has no money : డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామంటున్న ఉద్యోగా సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇక సమరమే అంటున్నారని.. ఇదేదో మనోళ్లేనా, ఇంకెవరైనా అన్నారా అని అనుకున్నానని అన్నారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఉద్యోగ సంఘాల నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై సమరం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారని.. . ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు మూడున్నర లక్షల మంది.. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా అని ప్రశ్నించారు. జీతాలు రానప్పుడు కనీసం నోరు విప్పారా?.. ఇప్పుడు జీతాలు రావడం లేదని ఉద్యోగులు అడగకుండానే వేశాం కదా అని ప్రశ్నించారు.
గతంలో బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండేందుకు రిటైర్‌మెంట్ ఏజ్ పెంచారు.. మీరు దాచుకున్న సొమ్ము, బెనిఫిట్స్ రూ.9 వేల కోట్లు పెండింగ్ పెట్టారు.. ప్రజలు కష్టాల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలు సమరం అంటున్నాయి.. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలు ఇచ్చారు.. సమస్య ఉంటే చర్చకు రండి, చర్చిద్దాం.. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్లు ఎవరూ బాగుపడలేదు.. ప్రజల మీద యుద్ధం చేస్తారా?.. రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారకండి, ప్రజల గుండెల్లో చురకత్తులు పొడవకండి అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
నెలకు రాష్ట్రానికి 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు చెప్పండి... ఏ పథకం ఆపాలి? బోనస్ తీసేద్దామా ? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా? అని ప్రశ్నించారు. స్థితిలో ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆర్థికంగా దివాలా రాష్ట్రంగా మారిపోతాం. అప్పు కూడా పుట్టట్లేదు. ఢిల్లీలో అపాయింట్‌మెంట్ కోరితే కూడా ఇవ్వట్లేదు. బ్యాంకులు దొంగల్లా చూస్తున్నాయన్నారు. చెప్పులు కూడా ఎత్తుకపోతారేమో అనిపిస్తోంది. దేశం ముందు తెలంగాణ పరిస్థితి హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్లు వేయాలని అనుకుంటే అణాపైసా లేదని.. కాంట్రాక్టర్లకు అప్పుల బకాయిలు వెయ్యి కోట్లకైనా ఇవ్వలేక పోతున్నామన్నారు. ఓ కుటుంబం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎలా ఉంటుందో... ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి అలాగే ఉంది. గత పాలకులు వెనక్కి పెట్టిన రూ.8,500 కోట్ల రిటైర్మెంట్ బకాయిలను తీర్చాల్సిన బాధ్యత మాది. అలాంటిది... గతంలో ఎప్పుడూ జరగనట్టు, నెల మొదటివారంలోనే జీతాలు ఇచ్చే ప్రభుత్వంపైనే ఉద్యోగ సంఘాలు సమరం ప్రకటించడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాల్లోనూ హాాట్ టాపిక్ గా మారాయి. చర్చలకు రేవంత్ పిలుపునిచ్చారు. మాట్లాడుకుందామని పిలిచినా ఒక్క రూపాయి అదనంగా ప్రయోజనాలు కల్పించే పరిస్థితుల్లో లేమని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు.. ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.