CM KCR Speech: ప్రతీ పార్టీ చరిత్ర చూడాలని, ఏ పార్టీ గెలిస్తే లాభమో చూడాలని ఓటర్లకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఏ పార్టీ ఏం చేసిందో చూడాలని, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు అని అన్నారు. రైతుబంధు వేస్ట్ అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, రైతుబంధుపై రకరకాలుగా కాంగ్రెస్ మాట్లాడుతుందని అన్నారు. రైతుబంధు పదం పుట్టిందే కేసీఆర్ నోట్లో నుంచి అని, రైతుబంధు ఓట్ల కోసం కాదని తెలిపారు. రైతులకు భిక్షం వేస్తున్నామన్నట్లు మాట్లాడుతున్నారని, రైతుబంధు ఉండాలా? వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల్లో వ్యక్తులు, కార్యదక్షతను చూడాలని సూచించారు. నిర్మల్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 'వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందా..? తాము 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. పదేళ్లు బీఆర్ఎస్‌ను ఆశీర్వదించారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా? నిర్మల్ జిల్లా కావాలని ఇంద్రకరణ్ రెడ్డి తపనపడ్డారు. నిర్మల్‌కు మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడైనా అనుకున్నామా? ఇంద్రకరణ్ రెడ్డి మెజార్టీ 80 వేలు దాటాలి. పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాం. దేశంలోనే మొదటిసారిగా దళితబంధు తీసుకొచ్చాం' అని తెలిపారు.


'ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నారు.  ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయి. నష్టం వచ్చినా రైతుల పంట కొంటున్నాం. ధరణి  తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలి. కేసీఆర్ ఉన్నంతవరకు తెలంగాణ సెక్యూలర్‌గా ఉంటుంది. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. ధాన్యం దిగుబడిలో త్వరలోనే తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను అధిగమిస్తుంది. ప్రజల ఆకాంక్ష్లలు నెరవేర్చే పార్టీ గెలవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. ఆ వజ్రాయుధాన్ని సరిగ్గా వాడాలి' అని కేసీఆర్ స్పష్టం చేశారు.


అన్ని పార్టీల అభ్యర్థుల గురించి తెలుసుకోవాలని, ఎవరు గెలిస్తే మంచిదో గమనించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని, అన్నీ ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. రైతులకు సాయం చేయాలని ఎవరూ ఆలోచించలేదని, తమ పార్టీనే ఆలోచించిందని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని, రాష్ట్రంలో హింసకు తావులేదని తెలిపారు. ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేకనే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సారి కూడా బీఆర్ఎస్‌ను ఆదరించాలని కోరారు. కాగా కేసీఆర్ వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తోన్నారు. కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేయడం లేదు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్సే తమకు పోటీ అని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి.