భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్​లో సీఎస్, ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమై.. వరదలు, సహాయక చర్యలపై మాట్లాడారు.



భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రానికి వరదలు పెరుగుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, క్షణ క్షణం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే పరిస్థితులున్నందున అందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇక నుంచి కరవు పరిస్థితులు ఉండవని, వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఉన్నతాధికారులకు తెలిపారు.



వరద పరిస్థితుల్లో ఏ విధంగా ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలో తెలిసిన కొంతమందితో సమర్థవంతమైన ఫ్లడ్ మేనేజ్మెంట్ టీమ్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. వరదలు ఉత్పన్నమైన సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల మీద అవగాహన కల్పించబడిన ఉన్నతాధికారులను నియమించాలని తెలిపారు. ఈ బృందాన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలన్నారు. 
ఫ్లడ్ మేనేజ్ మెంట్ టీంలో నియమించబడే అధికారులకు ఉండాల్సిన అవగాహనను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. 


ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, రెవిన్యూ, వైద్యశాఖ, జీఎడి శాఖల గురించిన అనుభవం కలిగి ఉండాలి. ఈ సభ్యుల్లో ఒకరు., లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తూ వారికి తక్షణ పునరావాస క్యాంప్ లను నిర్వహించడంలో అవగాహన ఉండాలి.
మూసీ నది వరద గురించి కేసీఆర్ ఆరా తీశారు. వరద ఉద్ధృతి పెరిగే పరిస్థితిని అంచనా వేసి.. లోతట్టులో నివసిస్తున్న ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు కురుస్తున్నవి. మహాబలేశ్వరం లో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఎగువ రాష్ర్ట్రాలనుంచి కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద పెరిగే పరిస్థితులు ఏర్పాడ్డాయి. రాష్ట్రంలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలి.
                                                                                                                                                                  - సీఎం కేసీఆర్



ఆగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి వున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణకోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి అన్ని ఇతర శాఖలతో సమన్వయం అవుతూ...బ్రిడ్జీలు రోడ్లు పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలన్నారు. 


 


నిర్మల్ లో పరిస్థితి ఎలా ఉంది


నిర్మల్‌ జిల్లాలో వరద పరిస్థితిపై ఆరా తీసిన సీఎం కేసీఆర్‌.. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.