MLC Kavitha: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్సీని సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కలిశారు. తమ సమస్యలను పరిష్కారించాలంటూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణి చుట్టు పక్కల ఉన్న ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. సింగరేణి ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నారు. అందుకే సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి కేసీఆర్ తప్పించారని పేర్కొన్నారు.
తెలంగాణ రాక ముందు 4000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి వారసత్వం ఉద్యోగాలను కల్పించారన్నారు. సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు. సీఎంతో సింగరేణి కార్మిక నాయకుల సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేస్ నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులకు వరాలు ప్రకటించిన కేసీఆర్
ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి కార్మికులకు సీఎం చంద్రశేఖర్‌రావు బొనాంజా ప్రకటించారు. దసరా, దీపావళి బోనస్‌గా రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. సింగరేణిని నిండా ముంచిందే కాంగ్రెస్ అని, సింగరేణి 100% తెలంగాణ కంపెనీ అన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో వీళ్లకు పరిపాలన చేతకాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చారని, అవి తిరిగి చెల్లించలేక 49% వాటాను కేంద్రానికి కట్టబెట్టారని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో సింగరేణి టర్నోవర్ రూ.12 వేల కోట్లు ఉండేదని. ఇప్పుడు రూ.33 వేల కోట్లకు పెంచినట్లు కేసీఆర్ తెలిపారు. రూ.419 కోట్లు ఉండే సింగరేణి లాభాలను రూ.2,222 కోట్లకు పెంచినట్లు చెప్పారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ కింద రూ.వెయ్యికోట్ల ఇస్తామన్నారు. టీడీపీ హయాంలో వారసత్వ ఉద్యోగాలు తొలగించారని, కాంగ్రెస్ దానిని పునరుద్ధరించలేదన్నారు. గని ప్రమాదంలో కార్మికులు చనిపోతే రూ. లక్ష ఇచ్చేవారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.10 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు.
వారసత్వ ఉద్యోగం తీసుకోకపోతే రూ.25 లక్షల ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికులు ఇళ్లు కట్టుకుంటామని అడిగితే వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. సింగరేణి జాగల్లో గుడిసెలు వేసుకున్న 20 వేల మంది నాయీ బ్రాహ్మణులు, రజకులు, పేదలకు జీవో 76 ద్వారా పట్టాలు ఇచ్చి ఆదుకున్నట్లు చెప్పారు.