తెలంగాణ వచ్చాకే గిరిజన, తండాలను డెవలప్ చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు అంటురోగాలతో ఉమ్మడి ఆదిలాబాద్ తల్లడిల్లిపోయిందని, ఇప్పుడు పరిస్థితి మొత్తం సద్దుమణిగిపోయిందని అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు అయిందని అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రెండు మూడు నెలల్లో మారుమూల తండాలకు, పొలాలకు కూడ త్రీ ఫేస్ కరెంట్ ఇస్తామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో 47 వేల ఎకరాల పోడు భూములను పంపిణీ చేస్తామని అన్నారు.


కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేల్చుతున్నారని అన్నారు. ధరణి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలు మాత్రం తీసేయాలని అంటున్నారని అన్నారు. ధరణి వల్లే భూములు ఇతరుల పేరు మీదకు మార్చడం కుదరదని, రైతు మరణించగానే రూ.5 లక్షల బీమా అందుతోందని అన్నారు. ధరణి లేకపోతే దళారీల రాజ్యం వస్తుందని, రకరకాల ఇబ్బందులు వస్తాయని అన్నారు. అదే తీసేస్తే రైతు బంధు కూడా అందే పరిస్థితి కూడా ఉండబోదని అన్నారు. మహారాష్ట్రలో కూడా ప్రజలు బీఆర్ఎస్ పథకాల పట్ల ఆకర్షితులు అవుతున్నారని, మాకు కూడా ఆ పథకాలు కావాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారని అన్నారు.


వార్దా బ్రిడ్జి మంజూరు


‘‘ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెంటబడి ప్రాణహిత మీద బ్రిడ్జి మంజూరు చేయించుకున్నారు. కొత్త మండలాలు ఏర్పాటు చేయించారు. వార్దా నది మీదుగా మహారాష్ట్ర పోవడానికి బ్రిడ్జి కోసం 75 కోట్లతో మంజూరు చేసుకున్నాం. ఆ జీవోను ఇప్పుడే విడుదల చేస్తున్నాం. ఆసిఫాబాద్‌కు టెక్నికల్‌ కాలేజీ కావాలని కోనేరు కోనప్ప అడిగారు. వెంటనే ఐటీఐ కాలేజీని కాగజ్‌ నగర్‌కు మంజూరు చేస్తున్నాం. నాగమ్మ చెరువులో బుద్ధుడిని పెట్టుకుని, దాన్ని మినీ ట్యాంక్‌బండ్‌లా ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో నాగమ్మ చెరువును కూడా పర్యాటక కేంద్రంగా మారుస్తాం’’


ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు గిరిజన పోడు పట్టాలు ఇస్తున్నాం. రేపట్నుంచే మీ మంత్రి, ఎమ్మెల్యేలు ఈ 47 వేల ఎకరాల భూమిని వెంటనే అందజేస్తారు. రానున్న మూడు రోజుల్లోనే పట్టాలు అందుతాయి. ఎవరెవరు ఆదివాసీలు, గిరిజన బిడ్డలకు త్రీఫేజ్‌ కరెంట్‌ లేదో వాళ్లకు రాబోయే రెండు మూడు నెలల్లోనే పొలాలకు త్రీఫేజ్‌ కరెంట్‌ ఇవ్వడం జరుగుతుంది. పోడు భూములు కొట్టుకున్నందుకు ఆదివాసీ గిరిజన బిడ్డల మీద గతంలో కేసులు పెట్టారు. ఒకవైపు పట్టాలు ఇచ్చి ఆ కేసులు అలాగే ఉంచితే తలాతోక లేనట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఆ కేసులను ఎత్తివేస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.


నేడు (జూన్ 30) మధ్యాహ్నం ఆసిఫాబాద్‌కు చేరుకున్న ఆయన ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కుమ్రంభీం చౌరస్తాలో కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అక్కడ పురోహితులు సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్.. కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో సీట్లో కూర్చోబెట్టారు. కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత కలెక్టర్‌.. సీఎం కేసీఆర్‌కు శాలువా కప్పి సన్మానించారు.