CM KCR Khammam Visit: బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను ఆ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో సభను నిర్వహించాలని చూస్తోంది. ఈనెల 18న జరిగే ఖమ్మం సభను యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సర్వశక్తులా కృషి చేసి సభను విజయవంతం చేయాలని, ఎక్కడా తగ్గొద్దని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పొరుగునే ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని పది నియోజక వర్గాలు కలిపి మొత్తంగా 20 నియోజక వర్గాల నుంచి ఐదు లక్షల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. సభ ఏర్పాట్ల బాధ్యతను మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కు అప్పగించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఖమ్మం బహిరంగ సభకు జన సమీకరణ, సభను సక్సెస్ చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో సమీక్షించారు. మూడు గంటలకుపైగా జరిగిన ఈ భేటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఖమ్మం సమీపాన ఉన్న సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాలు, మహబూబాబాద్, పాలకుర్తి, డోర్నకల్, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, ఇల్లందు, సత్తుపల్లి నియోజక వర్గాల నుంచి 40 వేల మంది చొప్పున జన సమీకరణ చేసేలా ప్రణాళిక వేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగతా నియోజక వర్గాల నుంచి 10 నుంచి 20 వేల మంది చొప్పున తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
కలెక్టరేట్ పక్కనే వంద ఎకరాల్లో సభ నిర్వహణ
రూట్ మ్యాప్, పార్కింగ్, ఎన్ని వాహనాలు అవసరం, ఆ ప్రాంతంలో ఎన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ మళ్లింపు వంటి అంశాలపైనా చర్చించారు. అయితే సభ బాధ్యతను అప్పగించిన ముగ్గురు మంత్రుల్లో మంత్రి హరీష్ రావు మంగళవారం రాత్రే ఖమ్మం చేరుకోనున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఒకట్రెండు రోజుల్లో వెళ్లనున్నారు. వారు సభ ముగిసే వరకు ఖమ్మంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. బుధవారం ఖమ్మం వీడీవోస్ కాలనీలోని మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సభ సన్నాహక సమావేశం నిర్వహించి.. జిల్లా, స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సభ ఏర్పాటు కోసం నూతన కలెక్టరేట్ పక్కనే ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కాగానే..పక్కనే ఉన్న 100 ఎకరాల ప్రాంగణంలో బీఆర్ఎస్ సభ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సోమ వారనే ప్రాంగణాన్ని చదును చేసే పనులు మొదలు పెట్టారు. ఖమ్మం నియోజక వర్గ నేతలు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. సీపీ విష్ణు వారియర్, ఇతర పోలీసు అధికారులు ప్రాంగణాన్ని పరిశీలించి, బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రాథమికంగా చర్చించారు.