Telangana Assembly :   తెలంగాణ ప్రభుత్వం  బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి తొలి వారంలోనే నర్వహించాలని అనుకుంటోంది. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరవాత వాటిలో రాష్ట్రాలకు ఉండే కేటాయింపుల ఆధారంగా బడ్జెట్ సిద్ధం చేస్తారు. ఈ సారి కేంద్ర బడ్జెట్ పెట్టిన వెంటనే.. రాష్ట్ర బడ్జెట్ ను పెట్టబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది కేంద్రం తీరు వల్ల తెలంగాణ భారీ నష్టపోయిందని ఈ విషయాన్ని ప్రకటించడానికి.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టాలనుకున్నారు. కానీ మళ్లీ ఆగిపోయారు. ఇప్పుడు నేరుగా బడ్జెట్ సమావేశాలు పెడుతున్నారు. 


ఇప్పటికే బడ్జెట్‌పై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు


గత 10 రోజులుగా రాష్ట్ర బడ్జెట్‌పై భారీ స్థాయిలో కసరత్తు జరుగుతోంది. అన్ని శాఖలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపాలని ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, వాటి వినియోగం, వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రతిపాదనలు నిర్ణీత ఫార్మాట్‌లో పంపించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో పంపాలని స్పష్టం చేసింది. వీటి ఆధారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కొన్ని రోజులుగా 2023-24 బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నారు.


రూ. 3 లక్షల కోట్ల వరకూ తెలంగాణ బడ్జెట్ ఉండే  అవకాశం 


రాష్ట్ర సొంత ఆదాయం 19-20 శాతం వృద్ధి నమోదు చేసినందున బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి తొలి ప్రాధా న్యత దక్కనుందని తెలుస్తోంది. దళిత బంధు వంటి పథకాలకు భారీగా నిధు లను కేటాయించేలా కార్యాచరణ చేస్తు న్నారు. ఎన్నికల ఏడాది కావడంతో సహజంగానే కొత్త పథకాలు, వ్యవసాయ ప్రాధాన్యత, సంక్షేమ రంగాలకు కీలక స్థానం దక్కనుంది. కొత్త ఆయకట్టు సాగులోకి తీసుకొచ్చేలా ఇరిగేషన్‌ శాఖ కీలక కసరత్తు చేస్తోంది., సీతారామా, డిండి, పాలమూరు ఎత్తి పోతల, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు నిధులు కోరనున్నట్లు స మాచారం. 


ముందుగానే బడ్జెట్.. ముందస్తు సన్నాహాల్లోనేనా ? 


డిసెంబర్‌ నాటికి సమకూరిన నిధులు, రాబడులు, వ్యయాల ప్రాతిపదికన అంచనాలు రూపొందిస్తున్నారు. కేంద్ర సాయాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, సీఎస్‌ఎస్‌, జీఎస్టీ సాయాలు ఫిబ్రవరి 1న స్పష్టత రానున్నాయి. ఇరిగేషన్‌ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్‌ వరుసగా ఈ ఏడాది కూడా నిధుల కేటాయింపులో సింహభాగం ఈ శాఖకే ఇవ్వనున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖకు రైతుబంధు, రైతుబీమాలతో ఎక్కువ నిధుల అవసరం కానుంది.. ఈ మేరకు ఈ శాఖకు రూ.25 వేల కోట్లకు పైగా కేటాయింపుల ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది. ఎప్పుడూ లేని విధంగా ఫిబ్రవరి ప్రారంభంలోనే బడ్జెట్ ప్రవేశ పెడుతూండటంతో కేసీఆర్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. 


ఫిబ్రవరి 13న తెలంగాణకు మోదీ - అంతకు ముందు కేంద్ర మంత్రుల వరస టూర్లు ! బీజేపీ దండయాత్రేనా ?