Modi Telangana Tour : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ పర్యటనకు రానున్నారు.  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.  జనవరిలోనే తెలంగాణకు పర్యటనకు మోదీ రావాల్సి ఉంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంతో పాటు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ బీజేపీ జాతీయ కార్యవర్గ  సమావేశాల కారణంగా వాయిదా పడింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ముందుగానే ప్రారంభించారు. ఇప్పుడు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించడానికి రానున్నారు. 






తెలంగాణలో విస్తృతంగా పర్యటించబోతున్న కేంద్ర మంత్రులు


మోదీ కంటే ముందు తెలంగాణలో వరుసగా కేంద్ర మంత్రులు పర్యటించబోతున్నారు. కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ఇరవై ఒకటో తేదీన వరంగల్, మహబూబూబాద్‌లో పర్యటిస్తారు. 22న పురుషోత్తం రూపాలా మెదక్‌,  అదే రోజున అర్జున్ ముందా నాగోబా జాతరకు  హాజరవుతారు. 23 చేవెళ్లకు ప్రహ్లాద్ జోషి వస్తారు. 28వ తేదీన హోంమంత్రి అమిత్ షా అసిఫాబాద్‌లో పర్యటిస్తారు. 


తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచారంతో ముందుగానే రాజకీయ పార్టీల ప్రచార భేరీ 


ఆ తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు వస్తారు.  తెలంగాణలో  ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేస్తున్నాయి.  తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడం, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న క్రమంలో.. జాతీయ నేతలు రాష్ట్రానికి వస్తున్నారు.  తెలంగాణలోని బీజేపీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారంటూ మోదీ అనేకసార్లు ప్రశంసించారు.  ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ అభినందించారు. ఇలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కూడా మోదీ పొగిడారు. గతంలో బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగిన సమయంలో పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. 


మోదీ ప్రారంభించనున్న అభివృద్ధి పనులు


రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి భూమిపూజ చేస్తారు. రూ. 1,850 కోట్ల వ్యయంతో 150 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమిపూజ చేస్తారు. రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న ‘రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు’ భూమిపూజ చేస్తారు. రూ. 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ. ల పొడవున నిర్మించిన డబుల్ లైన్ జాతికి అంకితం చేస్తారు.ఐఐటీ హైదరాబాద్‌లో రూ. 2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను ప్రధాని జాతికి అంకితం చేస్తారు.