తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనుంది. అందులో భాగంగా నేడు (ఆగస్టు 14) ఒక్కరోజే ఏకంగా 10,79,721 మంది రైతులకు రూ.6,546.05 కోట్ల మేర రుణాలను మాఫీ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆ నగదును ఆర్థికశాఖ వేసింది. ఈ రుణమాఫీతో కలిపి ఇప్పటిదాకా 16.66 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేసినట్లుగా అయింది. మొత్తంగా రూ.7,753 కోట్లను రుణామాఫీకి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆగస్టు 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మార్నాడు అంటే ఆగస్టు 3 నుంచి రైతు రుణమాఫీని ప్రారంభించాలని హరీశ్‌ రావు, అధికారులను ఆదేశించారు.


ఈ రోజు రూ.99,999 వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకి ఈరోజు ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పారు. 


2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్‌ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు తెప్పించుకున్నారు. ఇదంతా జరగడానికి ఒక ఏడాది సమయం పట్టింది. ఇంతలోనే కరోనా రూపంలో అవాంతరం వచ్చిందని ప్రభుత్వ పెద్దలు తెలిపారు.


కరోనా వల్ల రుణమాఫీ ఆలస్యం - ప్రభుత్వం


అయితే, అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడం, లాక్‌ డౌన్‌ ఉండడం, మన దేశంలో నోట్ల రద్దు పర్యవసానాలతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒడిదొడుకులకు గురికావడంతో ప్రభుత్వానికి వనరులు సమకూరడంలో ఇబ్బంది ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది. అయినా ఇప్పటికే 50 వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించి 1943 కోట్ల 64 లక్షల రూపాయలను బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతు రుణమాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. ఇక మిగిలిన మొత్తం కూడా మాఫీ చేయడానికి నిధులు సమకూర్చుకున్నది. తాజాగా రూ.99,999 రూపాయల వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణాల మాఫీకి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేసింది.


ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగస్టు 3వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్‌ రీలిజింగ్‌ ఆర్డర్‌ (బీఆర్‌వో) కూడా ఇచ్చారు. ఈ మేరకు ఆగస్టు 3వ తేదీ నుంచి రుణమాఫీకి సంబంధించిన నిధుల విడుదల మొదలయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రుణమాఫీకి సంబంధించి.. ఇచ్చిన మాట ప్రకారం, రూ.99,999 వరకు ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేయాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తంగా 16,66,899 మంది రైతులకు లబ్ధిచేకూరినట్లవుతుంది.