Rahul Dravid:
టీ20 జట్టులో బ్యాటింగ్ డెప్త్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అంటున్నాడు. ప్రస్తుత జట్టుతో పోలిస్తే 2024 టీ20 ప్రపంచకప్ టీమ్ భిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. టెయిలెండర్లు సైతం మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. విండీస్‌లో నంబర్ 11 ఆటగాడు అల్జారీ జోసెఫ్ సైతం సిక్సర్లు బాదగలడని మన దగ్గర అలా లేరని వివరించాడు. విండీస్‌తో ఐదు టీ20 సిరీసులో 2-3తో ఓటమి పాలయ్యాక ఆయన మీడియాతో మాట్లాడాడు.
'ఇప్పుడున్న దాంతో పోలిస్తే 2024 టీ20 ప్రపంచకప్ జట్టు చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత జట్టులో ఫ్లెక్సిబిలిటీ లేదు. మార్పులు చేసేందుకు కూర్పు సహరించలేదు. రాబోయే రోజుల్లో కొన్ని అంశాల్లో మేం మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నించాలి' అని రాహుల్ ద్రవిడ్ క్రిక్‌బజ్‌తో చెప్పాడు.
'మా బ్యాటింగ్ యూనిట్లో డెప్త్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నాం. టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఇంకా మెరుగవ్వాలి. వారు బౌలింగ్ అటాక్‌ను బలహీనపరచొద్దు. ఆట సాగే కొద్దీ మా స్కోర్లు పెద్దవి అవుతుంటాయి' అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
'ఒకసారి మీరు వెస్టిండీస్ జట్టును పరిశీలించండి. అల్జారీ జోసెఫ్ 11వ స్థానంలో వస్తున్నాడు. అతడు చక్కని బంతుల్నీ సిక్సర్లుగా మలుస్తాడు. ఇలాంటి డెప్త్ ఉన్న జట్లు ఇంకా ఉన్నాయి. ఈ అంశంలోనే మాకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మేం దీనిపై పనిచేయాల్సి ఉంది. మేం డెప్త్ పెంచుకోవాలని ఈ సిరీస్ నిరూపించింది' అని ద్రవిడ్ తెలిపాడు.
'ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో మేం వన్డే సిరీసులో కొన్ని ప్రయోగాలు చేశాం. మేం సాధించాల్సిన దానితో పోలిస్తే ఆ సిరీస్ లక్ష్యాలు కొంచెం భిన్నమైనవి. ఏదేమైనా ఆ సిరీస్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం' అని మిస్టర్ వాల్ వెల్లడించాడు. టీ20 సిరీసులో అరంగేట్రం చేసిన యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, ముకేశ్ కుమార్‌ను అతడు ప్రశంసించాడు. వారంతా చక్కగా ఆడారని పొగిడాడు.
'ఈ టీ20 సిరీసులో అరంగేట్రం చేసిన ముగ్గురూ సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డారు. నాలుగో టీ20లో యశస్వీ జైశ్వాల్ అదరగొట్టాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్‌లోనే అతడి గురించి మనకు తెలుసు. అంతర్జాతీయ క్రికెట్లోనూ అలాగే ఆడటం అద్భుతం. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ కీలకంగా ఆడాడు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో నిలబడుతున్నాడు. ఆడిన ప్రతిసారీ తెగువ, పట్టుదల ప్రదర్శిస్తున్నాడు. మంచి ఫీల్డింగ్ చేశాడు. మిడిల్‌లో లెఫ్టాండర్ ఉండటం ఎంతైనా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ముకేశ్ కుమార్ మూడు సిరీసుల్లోనూ ఆకట్టుకున్నాడు. కఠిన సందర్భాల్లో బంతితో రాణించాడు. అవకాశాలు వచ్చే కొద్దీ వీరంతా మెరుగవుతారు' అని ద్రవిడ్ వివరించాడు.
వెస్టిండీస్‌తో (IND vs WI) జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. ఆ తర్వాత వెస్టిండీస్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు చేజార్చుకొని టార్గెట్ ఛేజ్ చేసింది. 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. కరీబియన్లలో బ్రాండన్ కింగ్ (85: 55 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు), నికోలస్ పూరన్ (47: 35 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) రాణించారు. భారత్‌లో సూర్యకుమార్ యాదవ్ (61: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్. తిలక్ వర్మ (27: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అతడికి సహకారం అందించాడు.