CM KCR: ఎన్నికలు వస్తే ప్రజలు ఆగమాగం కావొద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మెదక్ భారీ బహిరంగ సభలో అన్నారు. ఎలక్షన్లు వచ్చిన సమయంలో ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలని సూచించారు. నిజమేది, అబద్ధమేది, వాస్తవమేది, అవాస్తవమేదని అంచనా వేసుకొని.. ఓట్లు వేయాలని అన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకోవాలన్నారు. నిజమైన ప్రజా సేవకులను గుర్తించి వారికి గెలిపించుకుంటే.. బ్రహ్మాండమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే రైతన్నలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఓవైపు బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబుతుందని, మరోవైపు కాంగ్రెస్ 3 గంటల కరెంటు చాలు అంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే ఘనపురం ఆయకట్టు గతంలో ఎప్పుడూ నీళ్లు రాలేదని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుగుతున్నారని తెలిపారు. కాగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నా ఘనపురంకు నీళ్లు కావాలంటే మెదక్ లో ఆర్డీఓ ఆఫీసు వద్ద ధర్నా చేయాలని సూచించారు.
ప్రతీ సంవత్సరం ధర్నా చేస్తే తప్పు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఘనపురం కాల్వలో తమ్మ చెట్లు మెలిచాయన్నారు. కానీ తాను సీఎం అయ్యాకా పద్మా దేవేందర్ రెడ్డి సర్వే చేసి, ఘనపురం ఎత్తు పెంచుకున్నామని స్పష్టం చేశారు. 30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని వెల్లడించారు. గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టుకు హైదరాబాద్ కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టారని గుర్తు చేశారు. కానీ ఈరోజు సింగూరును మెదక్ కే డెడికేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని.. దీనివల్లే జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయన్నారు. ఘనపురం ఆయకట్టు కింద ఒక గుంట ఎండిపోకుండా పంటలు పండించుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ రాకముందు అన్నదాతలు అంతా హైదరాబాద్ వచ్చి ఆటోలు నడుపుకునే స్థాయికి దిగజారిపోయారని అన్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం నీళ్లు రప్పించుకొని రైతుల సమస్యలు పరిష్కరించుకున్నామని వివరించారు.
రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తూ.. అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తూ.. అన్నదాతలకు అధిక దిగుబడి వచ్చేలా చేస్తున్నామని అన్నారు. మెదక్ లో పారే హల్దీ వాగు, మంజీరా వాగులపై దాదాపు 30 నుంచి 40 చెక్ డ్యాంలు కట్టుకొని ఆ నదులు 365 రోజులు సజీవంగా ఉండేలా చేసుకుంటున్నామన్నారు. కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ ద్వారా అక్కడి నుంచి అవసరం ఉన్నప్పుడల్లా వాగుల్లో నీళ్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. చెక్ డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.