అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది కానీ.. ఒక్కటే లోటు కనిపిస్తోంది. అదేమిటంటే చినజీయర్ స్వామి కనిపించకపోవడం. యాదాద్రి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకునే పనిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే. ఎందుకంటే యాదగిరి గుట్ట పేరును యాదాద్రి అనే పేరు పెట్టడం దగ్గర్నుంచి ఆలయం ఎలా ఉండాలో డిసైడ్ చేసే వరకూ చివరికి ప్రారంభోత్సవాన్ని ప్రపంచం మొత్తం ఆకర్షించేలా ఎలా చేయాలన్న అంశం వరకూ మొత్తం చినజీయర్ సలహాలతోనే జరిగింది. అలాంటి చినజీయర్‌ ఇప్పుడు యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవంలో కనిపించడం లేదు. ప్రత్యేకంగా ఎవర్నీ ఆహ్వానించలేదని ప్రభుత్వం చెబుతోంది. ఆహ్వానిస్తే వెళ్తాం..లేకపోతే చూసి ఆనందిస్తామని చినజీయర్ అంటున్నారు. అసలు మొత్తం ఆలయం తన సలహాలు, సూచనలతోనే పునర్మిర్మాణం అయినప్పటికీ ఆహ్వానం కోసం చినజీయర్ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది ? ఆంతే ఆయనే చూసుకున్నా.. ఆయన లేకపోయినా పర్వాలేదని ప్రభుత్వ యంత్రాంగం ఎందుకనుంది ?. రాజు- రాజగురువు బంధంలో ఎవరికీ కోపం వచ్చినా ఎవరికి నష్టం జరుగుతుంది ?


యాదాద్రికి ఈ వైభవం వెనుక చినజీయర్ సలహాలు !
 
తెలంగాణలో యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్చింది చినజీయర్. తిరమల స్థాయిలో యాదాద్రిని అభివృద్ధి చేసేలా కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా ప్రణాళికలు వేసింది చినజీయర్.  ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. చివరికి ఆలయ ఆకృతుల కోసం సినీ ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయిని సిఫార్సు చేసింది కూడా చినజీయరేనని చెబుతూంటారు. స్థపతుల కన్నా ఆనంద్ సాయే ఎక్కువ ఆలయానికి డిజైన్ చేశారు. ఇక ఆగమ పరంగా యాదాద్రి ఆలయం మొత్తం చినజీయర్ సలహాలతోనే నడుస్తోంది. ఎందుకంటే అధికారికంగా ఆయన గుట్ట ఆలయానికి ఆగమ సలహాదారు కూడా. ఆలయం అద్బుతంగా రావడానికి చినజీయర్ కృషి ప్రధాన కారణం అనుకోవచ్చు. ప్రభుత్వ పరంగా నిధులకు ఇబ్బంది లేకుండా చేసింది. అయితే నిధులు ఉంటేనే ఇలాంటి అద్భుత కట్టడాలు పూర్తి కావు.., సంకల్పం కావాలి.. అది చినజీయర్ తీసుకున్నారు. అందుకే ఇప్పుడు యాదాద్రి వైభవంగా వెలిగిపోతోందని ఎక్కువ మంది నమ్మకం.


కనీవినీ ఎరుగని రీతిలో చినజీయర్ చేతుల మీదుగా యాగం చేయాలనుకున్న కేసీఆర్ ! 


యాదాద్రి విషయంలో కేసీఆర్ ఎలాంటి పనిని అయినా చినజీయర్ సలహాలతోనే చేసేవారు. ఆలయ మహా సంప్రోక్షణ కోసం ఎన్నో ముహుర్తాలు చూసుకున్నారు. చివరికి మార్చిలో ఖరారు చేసుకున్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ముందు యాదాద్రిలో పర్యటించిన కేసీఆర్ నారసింహా మహా సుదర్శనయాగం నిర్వహణ విషయంలో అధికారులకు ప్రత్యేకమైన జాగ్రత్తలు చెప్పారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేశారు. మహా సుదర్శన యాగంలో 10వేల మంది రుత్విజులు పాల్గొనేలా సన్నాహాలు చేశారు. యజ్ఞగుండాల్లో వేయడానికి రెండు లక్షల కిలోల ఆవు నెయ్యి అవసరం. వాటిని సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ సమతామూర్తి విగ్రహారం అవిష్కరణ తర్వాత ఏర్పాట్లన్నీ నిలిపివేయమని ఆదేశించారు. ఆలయ మహాసంప్రోక్షణ ఆలయ అర్చకులతోనే నిరాడంబరంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆ ప్రకారమే ప్రస్తుత కార్యక్రమం జరిగింది.


శిలాఫలకంతోనే కేసీఆర్‌తో చినజీయర్‌కు గ్యాప్ !


చినజీయర్‌తో ఎలాంటి గ్యాప్ లేదని... కొత్తగా మీరు తీసుకొచ్చి పెట్టవద్దని కేసీఆర్ మీడియా సమావేశంలో జర్నలిస్టులపై కసురుకున్నంత పని చేశారు. కానీ గ్యాప్ ఉందో లేదో మాటల్లో కన్నా చేతుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం శిలాఫలకం. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వచ్చారు. ఆయన ఆవిష్కరించిన శిలాఫలకం మీద సీఎం హోదా ఉండాల్సిన కేసీఆర్ పేరు లేదు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. హాజరు అయినట్లయితే పరువు పోయేదని టీఆర్ఎస్ వర్గాలు అనుకున్నాయి. ఎందుకంటే చివరి క్షణం వరకూ కేసీఆర్ హాజరవుతారనే అనుకున్నారు. అదే సమయంలో ఎంతో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం కృతజ్ఞతలు కూడా వేదికపై నుంచి చినజీయర్ చెప్పలేదని.. మోదీని అదే పనిగా పొగుడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని మర్చిపోయారని భావించారు. దీంతో కేసీఆర్ అసంతృప్తికి గురయినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ చినజీయర్ ఆశ్రమానికి మామూలు కార్యక్రమాలకే వెళ్లి సాష్టంగా ప్రణామాలు చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం వైపు చూడలేదు. కేసీఆర్ మనసు గమనించిన టీఆర్ఎస్ నేతలూ వెళ్లలేదు.


చినజీయర్ కేసీఆర్ అభిమానాన్ని తక్కువగా చూశారా !?


బాస్ ఎప్పటికీ రైట్. అందులో మారో మాట లేదు. ఇక్కడ కేసీఆర్ చినజీయర్‌కు బాస్ కాకపోవచ్చు. కానీ కేసీఆర్ రాజు. ఆయనకు చినజీయర్ రాజ గురువు లాంటి వారు. కేసీఆర్ సహకారంతోనే చినజీయర్ ఇలా తన ప్రభావాన్ని విస్తరించుకున్నారని అందరూ విశ్లేషిస్తారు. ప్రభుత్వం సహకరించకపోతే ఆయన సమతామూర్తి విగ్రహాం లాంటి భారీ కార్యక్రమాన్ని చేపట్టే వారు కాదు. అంటే పరోక్షంగా బాస్ అనే అనుకోవాలి. అలాంటి బాస్‌ను చినజీయర్ స్వామి దూరం చేసుకున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ అయినా..రాజకీయ ప్రభావం అయినా కారణాలు ఏమిటనేది చెప్పుకోకపోయినా... చినజీయర్‌కు కేసీఆర్‌తో గ్యాప్ వచ్చిందనేది నిజం. ఈ విషయంలో ఇరువురూ అంగీకరించకపోవచ్చు. తాము ఎవరితోనూ రాసుకుపూసుకు తిరగబోమని... అడిగితే సలహాలిస్తాం..లేకపోలేదని చినజీయర్ అంటారు. కానీ ఆయనలోనూ కేసీఆర్ దూరమయ్యారన్న బాధ ఉంది. ఇటీవల ఆయనను యాదాద్రి అర్చకుల బృందం కలిసింది. ఆగమ సలహాదారు కాబట్టి మహాసంప్రోక్షణకు సలహాలు తీసుకున్నారు. ఆ సమయంలో త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని.. తాను స్వయంగా ఆలయానికి వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకుంటానని భరోసాగా చెప్పారు.  కానీ కేసీఆర్‌తో ఏర్పడిన గ్యాప్‌ను పూడ్చుకుంటానని ఆయన అనుకున్నారు. కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది.


చినజీయర్‌కూ మనో వేదనే !


యాదాద్రి ఆలయ ఆలోచన కేసిఆర్‌ది కావొచ్చు కానీ ఆచరణలోకి తెచ్చింది చినజీయర్‌. ఓ రకంగా అది ఆయన మానస పుత్రిక. మహాకుంభ సంప్రోక్షణ, నారసింహ మహాయాగం కూడా ఆయన చేతుల మీదుగానే జరిగి ఉంటే... ఈ ఆలయానికి ఆలోచన చేసి నిధులు కేటాయించిన కేసీఆర్‌తో పాటు చినజీయర్‌కు అంతటి పేరు ప్రఖ్యాతులు లభించి ఉండేవి. కానీ ఆయన ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఓ రకంగా స్వయంకృతంగా పోగొట్టుకున్నారని అనుకోవచ్చు. 


రాజుకు కోపం వస్తే రాజగురువుకైనా కష్టాలే !


ఈ మొత్తం ఎపిసోడ్‌లో నష్టపోయింది చినజీయర్ మాత్రమే. అర్థిక పరంగా లేకపోతే.. మరో విధంగా ఆయనకు నష్టం ఉండకపోవచ్చు. కానీ తన మానసపుత్రిక లాంటి ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్లలేకపోయారు. ఆహ్వానం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందటే...రాజు అనుగ్రహం కోల్పోవడం వల్లనే. అందుకే తన మాటే వేద వాక్కుగా రాజు భావిస్తాడని తెలిసినా రాజు పట్ల ఇంచ్ కూడా గౌరవం తగ్గనీయకూడని బాధ్యత రాజగురువుపైనే ఉంటుంది. ఆ విషయంలో చినజీయర్ ఎక్కడో లైన్ దాటారు. అందుకే  ప్రస్తుతం ఈ పరిస్థితి.