Chennuru BRS candidate Balka Suman: హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ కు అధికార పార్టీ బీఆర్ఎస్ షాకిచ్చింది. కాంగ్రెస్ నేత వివేక్ పై తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ (Telangana CEO Vikas Raj) కు చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఫిర్యాదు చేశారు. వివేక్ కంపెనీ నుంచి కోట్ల రూపాయలు చెన్నూరుకు చెందిన వ్యక్తులకు బదిలీ అయ్యాయని బాల్క సుమన్ ఫిర్యాదు చేశారు. వివేక్ కు చెందిన కంపెనీ నుంచి రూ.8 కోట్ల రూపాయలు చెన్నూరు (Chennuru)కు చెందిన వ్యక్తులకు జరిపిన లావాదేవీలపై కంప్లైంట్ ఇచ్చారు. 


మాజీ ఎంపీ వివేక్ కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి సోమవారం ఎనిమిది కోట్లు బదిలీ చేశారని తన ఫిర్యాదులో బాల్క సుమన్ పేర్కొన్నారు. సూట్ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీ ఉద్యోగులుగా ఉన్నారు. ఆ కంపెనీ రామగుండంలో వివేక్ ఇంటి అడ్రస్ తోనే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశామని బాల్క సుమన్ తెలిపారు. నగదు బదిలీ చేసిన ఈ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరారు. దాంతోపాటు ఈడీ, ఆదాయ పన్ను శాఖలకు కూడా ఫిర్యాదు చేస్తాం, ప్రత్యేక వ్యయ పరిశీలకునికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


మాజీ ఎంపీ వివేక్, కుటుంబ సభ్యులు, కంపెనీలు, బంధువుల బ్యాంకు ఖాతాల పై నిఘా పెట్టాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బులు పంపుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వివేక్ పాపంలో పాలు పంచుకోవద్దని స్థానిక వ్యాపారులను కోరారు. డబ్బు అహంకారంతో వివేక్ నేతలను హరాజ్ పాటలో కొనుగోలు చేస్తున్నారు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని వివేక్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.


వివేక్ ఇలాంటి నమ్మక ద్రోహి, మోసకారి వల్ల బీజేపీ కనీసం మేనిఫెస్టో కూడా ప్రకటించలేకపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కోట్లు సంపాదించి ఉంటే నీలాగా వ్యాపార సామ్రజ్యాన్ని ఏర్పరచుకునే వాన్ని కదా? అని బాల్క సుమన్ ప్రశ్నించారు. డబ్బు సూట్ కేసులతో నేతలను కొనుగోలు చేసి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారని, ధన రాజకీయాలు చేసే వ్యక్తులు ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపీడల్లాంటి వారంటూ మండిపడ్డారు. తెలంగాణ సమాజం ఇలాంటి వారికి బుద్ది చెప్పాలన్నారు.


చెన్నూరులో వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తికి, వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ది చేస్తున్న వ్యక్తికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. అభివృద్ధి పై మాట్లాడే దమ్ము లేక వివేక్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారుని చెప్పారు. తన ఛానెల్, పేపర్ ప్రతినిధులతో వివేక్ ఎన్నికల పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. వివేక్ కుటుంబం హయాంలో, బీఆర్ఎస్ హయాంలో చెన్నూరు అభివృద్దిపై చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. వివేక్ కు సంస్కారం లేదని, అలా మేము వ్యవహరించలేం అన్నారు. అందుకే సీఈవో వికాస్ రాజ్ ను ఆధారాలతో కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు.