అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవ వేళ తెలంగాణ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. నోటిఫికేషన్ విడుదల కాకముందే పెండింగ్‌లో ఉన్న డిమాండ్లు, సమస్యలను పరిష్కరిస్తూ పోతోంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న చండూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం, బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నల్గొండ జిల్లాలో అమ్మనబోలు పేరిట మరో మండలం ఏర్పాటుకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నల్గొండ జిల్లాలోని అమ్మనబోలు, ఉప్పలంచ, యాదాద్రి భువనగరి జిల్లాలోని సూరారం, బీతుర్కపల్లి, కుంకుడుపాముల గ్రామాలతో కొత్త మండలాన్ని ప్రతిపాదించారు. అభ్యంతరాలు, వినతులకు 15 రోజుల గడువు ఇచ్చారు. 


మరోవైపు కామారెడ్డి జిల్లాలో కొత్తగా మహమ్మద్‌ నగర్‌ మండలం ఏర్పాటైంది. గతంలో నిజాంసాగర్‌ మండలంలో ఉన్న 18 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. మహమ్మద్‌ నగర్‌ మండలం కూడా బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జగిత్యాల జిల్లాలోని తిర్మలాపురం, ఇబ్రహీంనగర్ గ్రామాల పేర్లను మల్లన్నపేట, శ్రీరాములపల్లిగా మార్పు చేశారు. రెండు గ్రామాల పేర్ల మార్పు కూడా 27వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది.


మరోవైపు ఈ నెల 29న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు సన్నద్ధతపై సైతం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించడానికి కొత్త పథకాలు, కార్యక్రమాల అమలుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిసింది. గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం గత మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి, దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే తమిళి సై సౌందరరాజన్ ఈ ప్రతిపాదనను  తిరస్కరించారు. వారికి అర్హత లేదని, సమగ్ర వివరాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై గవర్నర్ కు పూర్తి సమాచారం పంపడంపై చర్చించనుంది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను మళ్లీ సిఫార్సు చేయాలని భావిస్తోంది. మంత్రివర్గంలో మళ్లీ రెండు పేర్లను ఆమోదించి.. అన్ని వివరాలతో మళ్లీ రాజ్‌భవన్‌కు పంపే అంశంపై చర్చించనుంది. వీటితో పాటు ఇతర అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 


కాంగ్రెస్ ప్రకటించిన గ్యాస్ ధర రాయితీకి ధీటుగా ఏకంగా ఒక్కో సిలిండర్ పై  600 -700 సబ్సిడీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పేద కుటుంబాలకు మాత్రమే వర్తించేలా ఏటా ఆరు నుంచి 8 సిలిండర్లకు సబ్సిడీని వర్తింపచేసేలా మంత్రివర్గంలో చర్చించినున్నట్లు తెలుస్తోంది. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువత కోసం కొత్త పథకాలు, ఉద్యోగులకు హెల్త్ స్కీం, ఇంటి స్థలాల వంటి అంశాల పైన ఈ కేబినెట్ భేటీలో నిర్ణయాలు ఉంటాయని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగానే విధాన పరమైన నిర్ణయాలకు ఈ కేబినెట్ లో ఆమోదం తెలిపాలని కేసీఆర్ భావిస్తున్నారు.