సినిమాల్లో ఎన్నో క్రాఫ్ట్స్ ఉంటాయి. కానీ అందులో పనిచేసే చాలామంది గురించి ప్రేక్షకులకు తెలియదు. కేవలం దర్శకుడు, హీరోహీరోయిన్, తెరపై కనిపించే పాత్రలు తప్పా.. ఒక మూవీ కోసం కష్టపడే అందరి గురించి అందరికీ ఐడియా ఉండదు. యాక్షన్ సినిమాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు కూడా దాని వెనుక ఉండే స్టంట్ మాస్టర్స్ గురించి పూర్తిగా తెలియదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ స్టంట్ మాస్టర్స్‌లో శ్రీ బద్రి ఒకరు. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తూ.. తన ఫైట్స్‌తో, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు శ్రీ బద్రి. తాజాగా శ్రీ బద్రి.. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. జనసేన పార్టీ కోసం విరాళాలు ఇచ్చారు.


అప్పటినుండి పరిచయం


విశాఖపట్నంలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటి నుండి శ్రీ బద్రి తనకు తెలుసు అని బయటపెట్టారు పవన్ కళ్యాణ్. అప్పటినుండి తనతో పరిచయం ఉందన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రానికి స్టంట్ మ్యాన్‌గా పనిచేశాడు శ్రీ బద్రి. ఆ మూవీలో పనిచేసినందుకు తనకు రూ.50 వేలు రెమ్యునరేషన్ రాగా.. దానిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్‌కు అందజేసి.. జనసేన పార్టీకి ఫండ్‌గా ఉపయోగించుకోమని తెలిపాడు. దీంతో ఆ విరాళాన్ని అందుకొని శ్రీ బద్రికి ధన్యావాదాలు తెలిపాడు పవర్ స్టార్. అలా తమకు వచ్చే తక్కువ జీతంతో, తక్కువ రెమ్యునరేషన్‌లో జనసేనకు ఎంతోకొంత విరాళం అందిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు.


ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలు


పవన్ కళ్యాణ్‌ను కలిసి తన రెమ్యునరేషన్‌ను విరాళంగా అందించినందుకు శ్రీ బద్రి చాలా సంతోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “28 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయమే నన్ను నిలబెట్టింది. సార్ చేసే సాయం నాతో ఆగిపోకూడదు. ఎందరికో ఆయన సాయం అందిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే నాలాంటి ఎంతో మందికి అండగా నిలుస్తారు. ఆ ఆకాంక్షతోనే భోళాశంకర్ చిత్రానికి వచ్చిన పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాను” అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే తన పెండింగ్ సినిమాలు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్.


Also Read: మరో మూవీ నుంచి శ్రీలీలా ఔట్? ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial