ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో కాసేపు  ఆగారు. రోడ్డు పక్కన ఓ టీ దుకాణం ముందు కాసేపు కూర్చున్నారు. మంగళవారం సాయంత్రం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంగా బాలనగర్ మండల కేంద్రంలోని పెద్దయపల్లి చౌరస్తాలో గల దోస్త్ టీ టైమ్ అనే టీ షాపు వద్ద కాసేపు ఆగారు. అక్కడ తెలంగాణ తెలుగు దేశం అధ్యక్షుడు కాసానితో పాటు టేబుల్ చుట్టూ కూర్చొని ముచ్చటించారు.


ఈ సందర్భంగా అక్కడున్న స్థానికులతో చంద్రబాబు ముచ్చటించారు. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన విధానంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత ప్రభుత్వ పాలనకు గల వ్యత్యాసాన్ని ప్రజల చెప్పే మాటల ద్వారా స్వయంగా విన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు టీ టైం దగ్గర ఆగి టీ తాగి స్థానికులతో ముచ్చటించడం ఆశ్చర్యం కలిగిందని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. జెడ్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబు నాయుడు స్థానికులతో చాలా దగ్గరగా ముచ్చటించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు, యువత పోటీ పడ్డారు.


మధ్యాహ్నం కొత్తకోట దయాకర్‌ పాడె మోసి నివాళులు


టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. దయాకర్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లిన చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో టీడీపీలో కీలక నేత అయిన దయాకర్ రెడ్డి మరణం పట్ల సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు చంద్రబాబు. అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తుండగానే మధ్యలో ఆగి టీ తాగుతూ ముచ్చటించారు.


నేటి ఉదయం దయాకర్‌రెడ్డి కన్నుమూత


తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దయాకర్ మరణం పట్ల పలు పార్టీలకు చెందిన కీలక నేతలు సంతాపం తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపురం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తకోట దయాకర్‌రెడ్డి టీడీపీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేలగా గెలిచారు. అమరచింత నుంచి రెండుసార్లు మక్తల్‌ నుంచి మరోసారి విజయం సాధించారు.


కొత్తకోట దయాకర్ రెడ్డి టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దయాకర్ రెడ్డి.. 1994లో, 1999లో విజయం సాధించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి స్వర్ణ సుధాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభావం తగ్గడంతో 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.