CM KCR : దేశవ్యాప్త పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ చండీగఢ్ లో పర్యటించారు. రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతులు, అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేశారు. దేశచరిత్రలో పంజాబ్‌ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. పంజాబ్ రైతులు హరితవిప్లవంతో దేశ ప్రజల ఆకలిని తీర్చారన్నారు. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. పంజాబ్ రైతుల పోరాట స్ఫూర్తికి సలాంచేస్తున్నానన్నారు. కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాటం ఆగలేదన్నారు. రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు పెడుతోందన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్రవేస్తున్నారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు అందజేశారు. గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. 


రైతులు, సైనికుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ 
 
చండీగఢ్ లో రైతులు, జావాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. చండీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో రైతుల కుటుంబాలకు పరామర్శ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌, దిల్లీ, పంజాబ్‌ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ పాల్గొన్నారు. అంతకు ముందు ఆదివారం మధ్యాహ్నం దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం విందుభేటీలో ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు సీఎంలు దిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్లారు. సాగుచట్టాలపై ఉద్యమంపై అమరులైన రైతు కుటుంబాలను ముఖ్యమంత్రులు పరామర్శించారు. ఈ సందర్భంగా చండీగఢ్‌లో రైతులు, సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. అలాగే 543 మంది రైతు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం సీఎం కేసీఆర్‌ అందజేశారు.