ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలోని ఓ భాగం అయిన మేడిగడ్డ బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. ఆ బ్యారేజీ మధ్యలో ఓ పిల్లర్ కుంగిన సంగతి తెలిసిందే. దీంతో ఆరుగురు ఇంజీనిరింగ్ నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో మొత్తం ఆరుగురు సభ్యులు మంగళవారం (అక్టోబరు 24) మేడిగడ్డ బ్యారేజీను పరిశీలించారు. బ్యారేజీలోని 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలను వారు పరిశీలించారు. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్‌ పటుత్వం, జరిగిన నష్టంపై జల సంఘం కమిటీ అంచనా వేసి, సమగ్ర పరిశీలన చేయనుంది. ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనుంది. కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు.


మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో నీటిని విడుదల చేశారు. బ్యారేజ్‌ ఎగువ ప్రాంతం నుంచి నుంచి 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. ఈ నెల 21న రాత్రి భారీ శబ్దంతో బ్యారేజీ 20వ పియర్‌ కుంగిపోయినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కిందకు కుంగిపోయింది. బ్యారేజీపై రహదారిపై నుంచి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. డ్యామ్ కు .. క్రస్టు గేటుకు మధ్య పగుళ్లు కూడా వచ్చాయి. గోదావరి నదిపై ఉన్న ఈ బ్యారేజీ మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతుంది.