Telangana formation Day :  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించాని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి టూరిజం మంత్రిగా ఉండటంతో ఆయన శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణలోనూ, ఢిల్లీలోనూ నిర్వహిస్తోంది. ఇప్పుడు కేంద్రం కూడా చేయాలని నిర్ణయించడం ఆసక్తికరంగ ామరాింది.   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణ త్యాగం చేసిన యువతను 'అన్ సంగ్ హీరోస్' పేరుతో ప్రస్తావించడం మొదలు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ కట్టడాల గొప్పదనం, నిర్మాణ శైలి తదితరాలన్నింటినీ ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తోంది. 


అంబేద్కర్ సెంటర్‌లో కిషన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం !


ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్‌లో గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం జరుగుతుంది. కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర సాంస్కృతిక విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ప్రత్యేక అతిథిగా హాజరవుతారు.  తెలంగాణ సింగర్  హేమచంద్ర సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.  అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ ఏర్పడినందున దానికి ప్రతీకగా అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో తొలిసారి కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర గురించి, ఏ ఆశయాలు, ఆకాంక్షల కోసం రాష్ట్రం ఏర్పడిందో వాటి గురించి వివరించేఅవకాశం ఉంది. 


తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ వేడుకలు!


కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ తెలంగాణ ఫార్మేషన్ డే ఉత్సవాలను నిర్వహించడంపై ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఢిల్లీ వేదికగా తెలంగాణ భవన్  ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రతీ ఏటా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కూడా కేటాయిస్తున్నది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ మంత్రులను ఆహ్వానించి సత్కరించేవారు. ఈ సారి కూడా నిర్వహిస్తున్నారు. అదే సమయానికి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సైతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆవిర్భావ ఉత్సవాలు జరగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో పోటాపోటీగా నిర్వహిస్తున్నారన్నమాట. 


పోటాపోటీగా వేడుకల వెనుక రాజకీయ ఎజెండా ఉందా?


తెలంగాణలో రాజకీయంగా సున్నితమైన పరిస్థఇతులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పాటు విషయంపై ప్రధాని మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం చేశారు. నిరసనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.