DK Aruna MLA : గద్వాల ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు ఉత్తర్వులను పాటించి తక్షణమే.. డీకే అరుణను ఎమ్మెల్యేగా నోటిఫై చేస్తూ గెజిట్ ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.  హై కోర్ట్ ఆదేశాలు అమలు చేయాలని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి, అసెంబ్లీ కార్యదర్శి కి  కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ లేఖతో పాటు  హైకోర్టు ఉత్తర్వులను జత చేసింది.



తప్పుడు అఫిడవిట్ సమర్పించినందున గద్వార ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హతా వేటు


గత ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని నిర్ధారణ కావడంతో కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసి.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. 2018 నుంచి అనర్హతా వేటు వర్తిస్తుంది. అప్పట్నుంచి ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తించాల్సి ఉంటుంది. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. ఇందులో యాభై వేల రూపాయలు డీకే అరుణకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.     


కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందనున్న బీజేపీ నేత                       


2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా  28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి  బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా గుర్తిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కుతారు. ఇప్పటికే తీర్పును అమలు చేయాలని ఆమె  తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని, స్పీకర్ ను కలిసే ప్రయత్నం చేశారు. కానీ వారు అందుబాటులోకి రాకపోవడంతో అసెంబ్లీ సెక్టరీ ఆఫీసులో తీర్పు పత్రాలు అందించారు. 


ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన కృష్ణమోహన్ రెడ్డి 


తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  సోమవారంనాడు పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా  తప్పుడు కేసులు పెట్టారని  గద్వాల  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.  వచ్చే ఎన్నికల్లో గద్వాల నుండి  మరోసారి పోటీ చేసేందుకు  బీఆర్ఎస్ నాయకత్వం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టిక్కెట్టు కేటాయించింది. ఆయన ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఇలా అనర్హతా వేటు పడటంతో షాక్ కు గురయ్యారు. ఆరేళ్ల పాటు పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారని జడ్జిమెంట్ లో ఉండటంతో సుప్రీంకోర్టులో స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. స్టే వస్తే మళ్లీ ఆయనే ఎమ్మెల్యేగా ఉంటారు. లేకపోతే.. మాజీ అవుతారు. ఎన్నికల్లో కూడా పోటీ చేయలేరు.