సౌదీ అరేబియాలో భారత యాత్రికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురికావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Continues below advertisement

వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సీఎం సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. సీఎం రేవంత్ అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీ లో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు. వివరాలు తెలిపేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. 

Continues below advertisement

యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ప్రమాదం లో 42 మంది సజీవదహనం అయ్యారని సమాచారం. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయి, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ బజార్ ఘాట్ కు చెందిన 18 మంది ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు హైదరాబాద్ లోని సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 

+91 79979 59754

+91 99129 19545 లలో సంప్రదించాలని సూచించారు.

మక్కా యాత్ర ముగించుకుని భారతీయ యాత్రికులు బస్సులో మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌, బస్సు ఢీకొనగానే మంటలు చెలరేగి నిమిషాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో బస్సులోని వారంతా నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. చనిపోయిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది వరకు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఎవరైనా బయటపడ్డారా, మృతుల వివరాలు సైతం తెలియరాలేదు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.