BRS: తెలంగాణలో  అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ కాక మొదలైంది. అయితే రాష్ట్రంలో చాలామట్టుకు సిట్టింగ్‌లకే సీట్లు కేటాయిస్తామని, కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చుతామని, పనితీరు బాగాలేనివాళ్లు మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు, క్యాడర్‌కు అందుబాటులో ఉండాలని   గులాబీ అధినేత  కేసీఆర్ ఇదివరకే ఎమ్మెల్యేలకు పలుమార్లు సూచించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం తమ వైఖరి మార్చుకోవడం లేదు.. సరికదా, ఎన్నికలకు ముందు కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన  క్యాడర్‌పై చిందులు తొక్కుతున్నారు. దీంతో  పలు నియోజకవర్గాల్లో  ద్వితీయ శ్రేణి నాయకులు.. పార్టీ పెద్దలకు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. సిట్టింగులకు సీట్లిస్తే  తాము నష్టపోయేదేమీ లేదని, తమ నియోజకవర్గాల్లో పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. 


ఈ జాబితాలో  బీఆర్ఎస్‌కు అత్యంత కీలకమైన ఉమ్మడి కరీంనగర్‌తో పాటు వరంగల్‌లో  పలువురి ఎమ్మెల్యేలపై క్యాడర్ తిరగబడుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, వరంగల్ తూర్పు  ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో పాటు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీద  క్యాడర్  అగ్గిమీద గుగ్గిల్లంలా మండిపోతున్నారు. 


ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా  పాదయాత్ర.. 


రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీరుపై స్ధానికంగా ఉన్న  బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు  ఏకంగా నియోజకవర్గంలోనే పాదయాత్ర చేస్తున్నారు. పాలకుర్తి జెడ్పీటీసీ  కందుల సంధ్యారాణి, సింగరేణి  తెలంగాణ బొగ్గుగనుల కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి,   రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, అసంఘటితరంగ కార్మికుల నాయకుడు పాతపల్లి ఎల్లయ్యలు  రామగుండం నియోజకవర్గంలో  ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ పేరిట  మూడ రోజుల క్రితమే  పాదయాత్ర చేపట్టారు. చందర్ అనుసరిస్తున్న  తీరు, అవినీతి దందా, రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ (ఆర్ఎఫ్‌సీ)లో ఉద్యోగాలను ఇప్పిస్తానని మోసం చేశారని వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌ను మార్చాలని ఈ నలుగురితో పాటు మరికొంతమంది  స్థానిక నాయకులు కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నారు. తమ నలుగురిలో ఎవరికైనా లేదంటే మరే వ్యక్తికి అయినా టికెట్ ఇస్తే వారిని గెలిపించుకుంటామని.. చందర్‌కే టికెట్ ఇస్తే మాత్రం రామగుండంలో  బీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. 


వర్దన్నపేటలో.. 


వరంగల్ జిల్లాకు ఆనుకుని ఉన్న నియోజకవర్గం వర్ధన్నపేటలో కూడా  ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ప్రజలతో పాటు   పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడుతున్న భాష సరిగ్గా లేదని నాయకులు వాపోతున్నారు. ఘన్‌పూర్‌కు చెందిన రమేశ్‌ను తిరిగి అక్కడికే పంపి.. స్థానికంగా ఉన్న నాయకుడికి టికెట్ ఇస్తే తిరిగి బీఆర్ఎస్‌ను గెలిపించుకుంటామని  నియోజకవర్గంలోని పలువురు నాయకులు మంత్రి ఎర్రబెల్లి,  మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. రమేశ్.. తన చేతిలో అధికారం ఉందని, పోలీసుల సాయంతో తమపై కక్ష కడుతున్నాడని వాళ్లు  ఎర్రబెల్లి ముందు గోడు వెల్లబోసుకున్నారు. 


మానుకోటలో.. 


మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆది నుంచి వివాదాస్పదుడిగానే ఉన్నాడు.  ఇటీవలే ఓ గ్రామ పర్యటనకు వెళ్లిన ఆయనను స్థానిక బీఆర్ఎస్ నాయకులే ‘మా ఊరికి ఏం చేశావని ఇటొచ్చావ్’అంటూ నిలదీశారు.  మానుకోట నాయకులు ఇటీవలే   స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్‌తో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావుకూ మానుకోట ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్టు  బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 


వరంగల్ తూర్పు.. 


తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉన్న వరంగల్ తూర్పులో కూడా  బీఆర్ఎస్‌కు గడ్డు పరిస్థితులు తప్పేట్లు లేవు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ  వచ్చే ఎన్నికల్లో  అతడికి సీటు దక్కడం కష్టమేనని,  బీఆర్ఎస్ తొలగించబోయే ఎమ్మెల్యేలలో నరేందర్ కూడా ఉన్నాడని సమాచారం.  ఇటీవలే  వరంగల్ పర్యటనకు వెళ్లిన  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ కూడా.. నరేందర్‌కు తిరిగి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని  కిందిస్థాయి నాయకులతో చెప్పకనే  చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్  బలమైన ప్రత్యర్థిగా కొండా సురేఖను దించబోతుందనే వార్తల నేపథ్యంలో..  మాజీ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య లేదా గుండు సుధారాణికి  టికెట్ దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 


మానకొండూర్‌లో.. 


ఇక కరీంనగర్‌కు కూతవేటు దూరంలో ఉన్న మానకొండూర్‌లో కూడా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ‌పై క్యాడర్ గుర్రుగా ఉంది. వాస్తవానికి గత ఎన్నికలలోనే  ఆయనకు రెండోసారి టికెట్ దక్కడం  కష్టమని  భావించినప్పటికీ  కేసీఆర్..  రసమయినే నిలబెట్టారు. కానీ ఈసారి మాత్రం  రసమయికి చెక్ చెప్పేందుకు స్థానిక  బీఆర్ఎస్ నాయకులే సిద్ధమవుతున్నారు.  స్థానికంగా  క్వారీలలో కమీషన్లు దండుకున్నారని రసమయిపై ఆరోపణలున్నాయి. 


ఇవేగాక  మరిన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలపై  ద్వితీయ శ్రేణి నాయకులు  ఆగ్రహంగా ఉన్నారు.  పార్టీ బతకాలంటే వారిని  మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పుంజుకుంటుండం, బీజేపీ కూడా  తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుండంతో బీఆర్ఎస్‌కు  సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి అంశం కొత్త తలనొప్పులను సృష్టిస్తున్నది. మరి దీనిపై గులాబీ అధినేతలు  ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఆయా  నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.