పవన్ కళ్యాణ్ నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్డీఏ) తో కలవడం బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. చేగువేరా నుండి సావర్కర్ వైపు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయాణం శోచనీయమని అన్నారు. గతంలో విప్లవ వీరుడు చేగువేరా తరహాలో టీ షర్టులు వేసుకుని, సోషలిజం పైన గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కార్ వైపు దారి తప్పి నడవడం సరికాదని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే మిత్రపక్ష కూటమి సమావేశానికి హాజరు అయినందున సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంగళవారం (జూలై 18) స్పందించారు.


మతవాద పార్టీ అయినటువంటి బీజేపీ తో పవన్ కళ్యాణ్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వాదానికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. తమతో పొత్తులు పెట్టుకోని ప్రాంతీయ పార్టీలను సీబీఐ, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థలతో దాడులు చేయించడం వంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న బీజేపీకి మద్దతు పలకడం చేయొద్దని నారాయణ హితవు పలికారు. బీజేపీ, టీడీపీల మధ్య మధ్యవర్తిత్వం చేయడం పవన్ కల్యాణ్ కే కాకుండా రాజకీయాలకు కూడా మంచిది కాదని అన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రవర్తన తీరు బాధాకరమని తెలిపారు. మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదని అన్నారు.


ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి.. ఎన్డీయేలో ఎలా చేరుతున్నాడో చెప్పాలని నారాయణ పవన్‌ కల్యాణ్ ను నిలదీశారు. ‘‘నిన్నటి వరకు చేగువేరా దుస్తులు వేసుకుని.. ఇప్పడు సావర్కర్‌ దుస్తులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడు. అసలు పవన్‌ కల్యాణ్ కు నిలకడ లేదు. కదలకుండా 3 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు. ఆ తర్వాత పవన్‌ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చు’’ అని కే నారాయణ పవన్ కల్యాణ్ ను ఎద్దేశా చేశారు.