KTR Responds On Formula E Car Race Allegations: 'రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకే తనపై కేసు పెడతారా.?' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ఫార్ములా - ఈ కారు రేస్ (Formula E Car Race) వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ క్రమంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా.. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ఎందుకు కేసు పెడతావు. నేను జైలుకెళ్లేందుకైనా సిద్ధమే. జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధపడతాను. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయి. నన్ను విచారించేందుకు అనుమతివ్వడం గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడితే ఎదుర్కొంటాను. విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను చేర్చాలనే ఉద్దేశంతోనే ఫార్ములా - ఈ కారు రేసింగ్ ఏర్పాటు చేశాం.' అని పేర్కొన్నారు.
మంచి ఉద్దేశంతోనే..
'మొట్ట మొదటి కారు రేస్ 1894లో పారిస్‌లో జరిగింది. ఫార్ములా వన్ రేస్ మొదటి రేసు 1946లో ఇటలీలో జరిగింది. ఈ రేస్ నిర్వహించేందుకు దేశాలే పోటీ పడతాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా 2003లో ఎఫ్1 రేసు హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రయత్నం చేశారు. ఎఫ్ 1 రేసు కోసం 2011లోనే దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు చేశారు. రాజీవ్ గాంధీ హయాంలో 1984 ఏషియన్ గేమ్స్, అదే విధంగా కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్‌లో జరిగాయి. దీని కోసం యూపీఏ ప్రభుత్వం రూ.70,600 కోట్లు ఖర్చు చేసింది. ఇదే క్రీడల్లో యూపీఏ ప్రభుత్వం మొత్తానికి భారీగా కుంభకోణం చేసింది. ఎఫ్ 1 రేసు కోసం నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదని వాళ్లు చెప్పారు. ఫార్ములా రేసింగ్‌లో కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో చేసే రేసింగ్‌ను ఫార్ములా ఈ-రేస్ అంటారు. ఇది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోంది. ఆ స్థానంలో హైదరాబాద్ చేర్చాలని మేము ఈ-రేస్ ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేశాం. దీన్ని ఒక రేసింగ్‌గా మాత్రమే చూడలేదు. ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయాలనుకున్నాం.' అని పేర్కొన్నారు.
'ఫార్ములా ఈ-రేస్, మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 2, 500 కోట్లు పెట్టుబడులు తెచ్చాం. నిర్వహణ సంస్థ, హెచ్ఎండీఏ, గ్రీన్ కో అనే మూడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్ కో సంస్థ మాత్రం తమకు లాభం రాలేదని పక్కకు తప్పుకొంది. దీంతో ఈ-రేస్ పోకుండా ఉండేందుకు ఆ డబ్బులను మేము ఇద్దామని అర్వింద్ గారికి చెప్పాను. వాళ్లకు స్పాన్సర్లు దొరక్కపోవటంతో ప్రమోటర్ దొరికే వరకు నేనే భరోసా ఉంటానని చెప్పాను. ప్రభుత్వం తరఫున ఆ డబ్బు ఇద్దామని చెప్పాను. హెచ్ఎండీఏకు తెలియకుండా మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు. కానీ హెచ్ఎండీఏకు పూర్తిగా తెలుసు. ఈ-రేస్‌ను మేము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో అర్వింద్ కుమార్ గారి తప్పు ఏం లేదు. నేను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటాను.' అని స్పష్టం చేశారు.
'సీఎంపైనే కేసు పెట్టాలి'
హైదరాబాద్ ఈ - రేస్‌ను రద్దు చేయటంతో జాగ్వార్, నిస్సాన్ లాంటి సంస్థల వాళ్లు సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు. 'రేవంత్ రెడ్డి దిక్కుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్ ఇజ్జత్ పోయింది. మనకు రూ. 700 కోట్లు లాస్ వచ్చింది. నిజానికి హైదరాబాద్‌లో ఈ-రేస్ రాకుండా మన నగరం ఇమేజ్ దెబ్బ తీసినందుకు ఆయనపైనే కేసు పెట్టాలి. అవినీతి జరిగితే ఏసీబీని వాడాలి. కానీ ఇక్కడ అవినీతి ఏముంది? నాకు వచ్చింది ఏముంది?. నిజానికి కేసు పెట్టాలంటే మేఘా కంపెనీ మీద పెట్టాలి. రూ. 50 లక్షల బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డిపై 8 ఏళ్లుగా ఎలాంటి చర్యలు లేవు. మేము బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే నువ్వు బ్యాడ్ ఇమేజ్ చేస్తున్నావు. విశ్వనగరం ఇమేజ్ లేకుండా చేస్తే పెట్టుబడులు వస్తాయా? నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసిన మేము నీ హామీలపై పోరాటం చేస్తూనే ఉంటాం.' అని కేటీఆర్ అన్నారు.
Also Read: 2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి